Telugu Global
Telangana

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం -కేటీఆర్

మోదీ హయాంలో రూపాయి పాతాళంలో నిరుద్యోగం ఆకాశంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు కేటీఆర్. తెలంగాణ పుట్టుకని వెటకారం చేసిన మోదీకి ఈ గడ్డపై అడుగు పెట్టే హక్కు లేదన్నారు.

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం -కేటీఆర్
X

ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు బీఆర్ఎస్ నేతలెవరూ హాజరు కావట్లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఆ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని అన్నారు. మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ సహా స్థానిక నేతలకు ఆహ్వానాలు అందిన నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. అసలు మోదీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

బిచ్చమేస్తున్నారా..?

ఏడాది క్రితం గుజరాత్ లోని దహోద్ లో 25వేలకోట్ల రూపాయల నిధులతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మోదీ శంకుస్థాపన చేసిన విషయం గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మాత్రం మోదీ మొండిచేయి చూపించారని మండిపడ్డారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి ఇప్పుడు రిపేర్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ అంటూ కేవలం 521 కోట్ల రూపాయలు విదిలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మోదీ బిచ్చమేస్తున్నారా అని ప్రశ్నించారు. వరంగల్ లో వెయ్యి కోట్ల రూపాయలతో ప్రైవేటు భాగస్వామ్యంతో కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, ప్రైవేటు రంగంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతుంటే, కేంద్రం రూ.521 కోట్లతో ఫ్యాక్టరీ పెడతామనడం హాస్యాస్పదం అన్నారు. మోదీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని చెప్పారు.


మోదీ హయాంలో రూపాయి పాతాళంలో నిరుద్యోగం ఆకాశంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు కేటీఆర్. తెలంగాణ పుట్టుకని వెటకారం చేసిన మోదీకి ఈ గడ్డపై అడుగు పెట్టే హక్కు లేదన్నారు. సమాజంలో మంటలు పెట్టి ఆయన చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణపై కడుపులో విషం పెట్టుకుని మోదీ ఇక్కడికి వస్తున్నారని అన్నారు.

ఆ కుటుంబాలకు అండగా..

ఇటీవల అకాల మరణం చెందిన జగదీష్, సాయిచంద్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ఆ రెండు కుటుంబాలకు చెరో కోటిన్నర రూపాయలు సాయం చేయబోతున్నట్టు ప్రకటించారు. వారి పిల్లల పేరుతో ఆ సాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. వారి తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాయిచంద్ భార్యకు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ రెండు కుటుంబాలకు వెంటనే మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

First Published:  7 July 2023 12:56 PM IST
Next Story