బీఆర్ఎస్ దూకుడు.. 54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లు
నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే 115 స్థానాలకు పైగా అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న గులాబీ పార్టీ.. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. తాజాగా 54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. అనంతరం నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలని ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. విపక్షాలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చే వేదికలు మాత్రమేనని.. బీఆర్ఎస్‌కు పదేళ్ల ప్రగతిని వివరించే అవకాశమని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని సూచించారు.
నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా నియమించిన వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఛైర్మన్లు, మాజీ ఛైర్మన్లు ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఇన్‌ఛార్జులుగా వ్యవహరించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఛైర్మన్ ప్రతాప రెడ్డి ఇన్‌ఛార్జులుగా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ అర్బన్ బాధ్యతలు, మంత్రి సత్యవతి రాథోడ్-మహబూబబాద్, మంత్రి పువ్వాడ అజయ్- మధిర నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా వ్యవహరించనున్నారు.