Telugu Global
Telangana

చేరికల ఎపిసోడ్ లో సంచలనం.. మాజీ ఎమ్మెల్యే కోసం రెండు పార్టీల గొడవ

చేరికల ఎపిసోడ్ లో ఇలాంటి ట్విస్ట్ లు, చేజింగ్ లు ఇటీవల కాలంలో ఎక్కడా చూడలేదు. ఆరూరికోసం రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగడం విశేషం.

చేరికల ఎపిసోడ్ లో సంచలనం.. మాజీ ఎమ్మెల్యే కోసం రెండు పార్టీల గొడవ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత.. నాయకుల జంపింగ్ లు రోజువారీ వార్తలుగా మారిపోయాయి. పార్టీ మారాలనుకుంటున్న వారు కాస్త ముందుగానే ఓ పద్ధతి ప్రకారం పాత పార్టీపై బురదజల్లి, ఆ తర్వాత అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని, మహూర్తం ఫిక్స్ చేసుకుని కొత్త పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలామంది ఇలానే పార్టీ మారారు. కానీ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారే ఎపిసోడ్ పెద్ద హైడ్రామాను తలపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఆయనకోసం పోటీ పడటం విశేషం.

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రస్తుతం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా ను కూడా కలిశారు. ఈరోజు హన్మకొండలో తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ని వీడుతున్నట్టు ప్రకటించాలనుకున్నారు. కానీ అంతలోనే అక్కడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఆయనను బుజ్జగించి తమతో కారులో తీసుకెళ్లారు.


చేజింగ్.. చేజింగ్..

ఆరూరి రమేష్ ని బీఆర్ఎస్ నేతలు కారులో తీసుకెళ్తున్నారన్న సమాచారంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. మార్గమధ్యంలో అడ్డుకున్నారు. బలవంతంగా తమతో తీసుకెళ్లేందుకు ఆరూరిని కారులోనుంచి లాక్కొచ్చారు. ఈ ఘర్షణలో ఆరూరి రమేష్ చొక్కా కూడా చినిగిపోయింది. చేరికల ఎపిసోడ్ లో ఇలాంటి ట్విస్ట్ లు, చేజింగ్ లు ఇటీవల కాలంలో ఎక్కడా చూడలేదు. ఆరూరికోసం రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగడం విశేషం. ఆయన నిర్ణయానికి విలువ ఇవ్వాలని, ఇలా బలవంతంగా తీసుకెళ్లడమేంటని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆరూరి మాత్రం ఇంకా నోరువిప్పలేదు. ఈ హైడ్రామాకి ముగింపు ఎప్పుడో చూడాలి.

First Published:  13 March 2024 2:46 PM IST
Next Story