Telugu Global
Telangana

రిసెప్షన్లో వరుడికి కరెంటు షాక్

రిసెప్షన్ కోసం అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంజన్ తో కలసి ఫొటోలు దిగేందుకు భార్య రెడీ అవుతోంది. ఇంతలోనే నిరంజన్ విగత జీవిగా మారాడు.

రిసెప్షన్లో వరుడికి కరెంటు షాక్
X

మరణం ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో వస్తుందో ఊహించడం కష్టం. పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వరుడుని సరిగ్గా రిసెప్షన్ రోజే మృత్యువు కబళించింది. భర్తతో ఏడడుగులు వేసిన వధువుకి మరుసటి రోజే తాళి బొట్టు తెంచేసింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన సిద్ధిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగింది.

కరెంట్ షాక్ తో వరుడు మృతి

వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్, స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. శనివారం ఆయన వివాహం జరిగింది. ఆదివారం రిసెప్షన్. ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి. వెంకటాపూర్ లో వరుడు నిరంజన్ ఇంటి చుట్టూ విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. వర్షాలు కూడా తోడవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు నిరంజన్.

రిసెప్షన్ కోసం అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంజన్ తో కలసి ఫొటోలు దిగేందుకు భార్య రెడీ అవుతోంది. ఇంతలోనే నిరంజన్ విగత జీవిగా మారాడు. రిసెప్షన్ వేదిక వద్దే కుప్పకూలాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఎంతో చలాకీగా, అందరితో కలుపుగోలుగా ఉండే నిరంజన్ చనిపోయాడంటే ఎవరూ నమ్మలేదు. ఉపాధ్యాయుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్న ఆయన వైవాహిక జీవితం ప్రారంభించకుండానే ప్రాణాలు కోల్పోయాడు.

First Published:  4 Sept 2023 5:06 PM IST
Next Story