హైదరాబాద్ నాచారంలో మరో బాలుడిపై వీధి కుక్కల దాడి - జీహెచ్ఎంసీ వైఫల్యాన్ని కళ్లకు కట్టించిన ఘటన
నాచారంలో వీధిలో పడిన తన ఆట బొమ్మను తెచ్చుకునేందుకు వెళ్లిన ఆశ్రిత్ అనే మరో బాలుడు కుక్కల బారిన పడి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బాలుడు ప్రదీప్ వీధి కుక్కల దాడిలో హతమైన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే హైదరాబాద్‌లోని నాచారంలో వీధిలో పడిన తన ఆట బొమ్మను తెచ్చుకునేందుకు వెళ్లిన ఆశ్రిత్ అనే మరో బాలుడు కుక్కల బారిన పడి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న విషయం ఆందోళన కలిగిస్తోంది.
ఒక్కసారిగా బాలుడు వాటినుంచి తప్పించుకునేందుకు వేగంగా పరిగెత్తడం, అదే సమయంలో అక్కడే ఉన్న బాలుడి అక్క కుక్కలను అదిలించడం, తన చేతిలో వస్తువులను వాటిపైకి విసరడంతో అవి బాలుడిని వదిలేసి వెనక్కి వెళ్లాయి. ఈ ఘటనలో కిందపడ్డ బాలుడు మోకాళ్లు గీసుకుపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనను చూస్తే ప్రదీప్ మృతి చెందిన అనంతరం నగరంలో రక్షణ చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. కుక్కలకు స్టెరిలైజ్ చేసి తర్వాత అదే ప్రాంతంలో వదిలేయడం వల్ల కుక్కల సమస్య తొలగిపోదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.