Telugu Global
Telangana

బూర వల్ల బీజేపీకి ఎంత లాభం?

మునుగోడు ఉపఎన్నిక వేళ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. నియోజకవర్గంలో మెజారిటి ఓటర్లు బీసీలే అయినప్పటికీ సామాజికవర్గంపై బూర పట్టు ఎంత‌ అన్నది కీలకం.

బూర వల్ల బీజేపీకి ఎంత లాభం?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ టీఆర్ఎస్ ఎంపీ బూరగడ్డ నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌కు రాజీనామ చేశారంటే ఆయన బీజేపీలో చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీలో చేరటానికి బూర ఢిల్లీకి వెళ్ళినా ఆ ముచ్చట ఇంకా అధికారికంగా జరగలేదు. సరే బీజేపీలో చేరిన తర్వాత బూర వల్ల కమలం పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉంటుంది? అనేది పెద్ద ప్రశ్న.

ఇప్పుడు బీజేపీకి అర్జంటుగా కావాల్సింది తమను మునుగోడు ఉపఎన్నికలో గెలిపించే నేత. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంతో బిల్డప్పిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డే బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. అయితే ప్రచారం సందర్భంగా రాజగోపాలరెడ్డి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాంతో రాజగోపాల్ గెలుపుపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ అగ్రనేతలెవరు ఇంతవరకు ప్రచారంలోకి దిగలేదు.

ఇదే సమయంలో ప్రచారంలో అభ్యర్ధికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే బూర నర్సయ్య గౌడ్ పార్టీలో చేరబోతున్నారు. నియోజకవర్గంలో మెజారిటి ఓటర్లు బీసీలే అయినప్పటికీ సామాజికవర్గంపై బూర పట్టు ఎంత‌ అన్నది కీలకం. వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిందంటే జనాలు కేసీఆర్‌ను చూసే ఓట్లేశారు. ఎక్కడైనా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు కూడా ఉండచ్చు.

అయితే ఇప్పుడు మునుగోడులో బూర అంతటి బలమైన నేతేనా ? తన సామాజికవర్గం ఓట్లన్నింటినీ బీజేపీకి వేయించేంత సీనుందా ? నిజంగానే బూరకు అంతటి కెపాసిటి ఉంటే అసలు కేసీఆర్ వదులుకునే వారే కాదు. కేసీఆర్‌ మీద అసంతృప్తితో ఎవరొచ్చినా బీజేపీ చేర్చుకుంటోంది. ఇప్పుడు బూర కూడా అలాగే చేరుతున్నారంతే. బహుశా తాను ఉపఎన్నికలో బీజేపీని గెలిపించలేనని బూరకు కూడా తెలిసే ఉంటుంది. అయినా ఎందుకు చేరారంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసమనే అనుకోవాలంతే. బీజేపీ కూడా ఎందుకు చేర్చుకుంటోందంటే నాయకుల కొరతతో అవస్థ‌లు పడుతోంది కాబట్టే.

First Published:  15 Oct 2022 7:17 AM
Next Story