Telugu Global
Telangana

బోనస్‌ బోగస్‌.. మద్దతు ధరకే దిక్కులేదు

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్నిరకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని హరీశ్‌ డిమాండ్‌

బోనస్‌ బోగస్‌.. మద్దతు ధరకే దిక్కులేదు
X

ప్రతిపక్షాలపై కుట్రలు చేయడం, అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం, ప్రతిపక్ష నేతలను తిట్టడానికి తప్పా రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు. ఖమ్మం పత్తి మార్కెట్‌లో బీఆర్‌ఎస్‌ నేతల బృందం పర్యటించింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కనీస మద్దతు ధరల కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు. ఆరోజు అన్ని పంటలకు బోనస్‌ఇస్తామన్నారు. పత్తికి కూడా బోనస్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు బోనస్‌ బోగస్‌ అయ్యింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.

వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉన్నది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే అన్నారు.

మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచింది

ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హరీశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. శంకర్ రమాదేవి అనే రైతులు 8 ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం 5 క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే.రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ కూడా ఇవ్వాలి. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదన్నారు.

ముగ్గురు మంత్రులు ఉన్నా.. ప్రజా సమస్యల పట్టవా?

రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వమని మోసం చేశారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని మోసం చేశారు. రూ.12,000 రైతు కూలీలకు ఇస్తామని మోసం చేశారు. రూ.500 బోనస్ ఇస్తామని కూడా మోసం చేశారు.జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాడడమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు.4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరగం వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.ఒక రైతుకైనా సన్నరకం వడ్లకు బోనస్ వచ్చిందా అని నిలదీశారు. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది.సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడడం లేదు.పత్తి సీసీఐ కేంద్రాల్లో 7,000 మెట్రిక్ టన్నులు కొంటే, మార్కెట్లో 15,000 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు జరిగింది. సీఎం రేవంత్‌ పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు.ముఖ్యమంత్రి మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు, కానీ పత్తి వరి కొనుగోళ్లపై సమీక్ష చేయడం లేదు.మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికి మెమోలు జారీ చేయడం లేదు.తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో అని ఎద్దేవా చేశారు.ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్నిరకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.పత్తిని రూ.7,500కు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

First Published:  22 Nov 2024 10:31 AM IST
Next Story