Telugu Global
Telangana

వచ్చే సీజన్‌ నుంచే బోనస్.. టీ.కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల విషయమై NDSA ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు పొంగులేటి.

వచ్చే సీజన్‌ నుంచే బోనస్.. టీ.కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
X

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలతో కలిసి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.


టీ.కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే -

గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటివరకూ 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరించిన 3 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.


సన్న వడ్లకే రూ.500 బోనస్‌

ఇక రాబోయే సీజన్‌ నుంచి సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటా ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రేషన్‌ బియ్యంతో పాటు స్కూళ్లలో మధ్యాహ్నం భోజనానికి బయట నుంచి కాకుండా ఇవే బియ్యాన్ని ఉపయోగిస్తామన్నారు.


శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ

సర్కార్‌ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తామన్నారు పొంగులేటి. మౌలిక వసతుల కల్పనకు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక స్కూళ్ల నిర్వహణ బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.


అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల విషయమై NDSA ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు పొంగులేటి. మూడు బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకుండా గేట్లు ఎత్తే ఉంచాలని కమిటీ సూచించిందన్నారు. త్వరలోనే మూడు బ్యారేజీలకు మళ్లీ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో నీటిని ఎత్తిపోసే వీలుంటే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు పొంగులేటి.

జూన్‌ 2 నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు పొంగులేటి. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని ఆహ్వానించి సన్మానిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్దలను సన్మానిస్తామన్నారు. వేడుకల నిర్వహణ కోసం ఈసీకి లేఖ రాస్తామన్నారు పొంగులేటి.

First Published:  21 May 2024 12:02 AM IST
Next Story