Telugu Global
Telangana

తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది... కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటి : రాహుల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది... కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటి : రాహుల్ గాంధీ
X

తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పని చేసి అధికారంలోకి తీసుకొని రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కర్ణాటకలో అవినీతితో నిండిన బీజేపీని అక్కడి ప్రజలు ఓడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటకలో ఎంతో ఉత్సాహంగా పని చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే ఉత్సాహంతో పని చేయాలని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఖమ్మంలో 'తెలంగాణ జన గర్జన' పేరుతో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ..

తెలంగాణ అనేది ఒక స్వప్నంగా ఉంటే.. దానిని కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని రాహుల్ చెప్పారు. రాష్ట్రం కోసం ఎన్నో వర్గాలు కలలు కన్నాయి. పేదలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ఎందరో తెలంగాణ కోసం కలలు కన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఆ కలలన్నింటినీ ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఒక కల కంటే.. బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మరో కల కన్నారని దుయ్యబట్టారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా మారిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు అన్ని కలిసి బీజేపీకి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌కు బీఆర్ఎస్ వస్తే తాము అక్కడ కూర్చోబోమని చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్‌కు, బీజేపీ బీ-టీమ్‌కు మధ్యే అని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోడు భూములన్నీ ఆదివాసీలు, గిరిజనులకే చెందేలా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కూడా రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు.

దేశవ్యాప్తంగా తాను భారత్ జోడో యాత్ర చేశాను. అప్పుడు తెలంగాణ మీదుగా నా యాత్ర కొనసాగింది. ఆ తర్వాత మరోసారి తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ చెప్పారు. తాను జోడో యాత్ర చేసి దేశాన్ని కలపాలని ప్రయత్నించాను. కానీ ఇతరులకు మాత్రం దేశాన్ని విభజించడం, విద్వేషాన్ని పెంచడమే ఐడియాలజీగా మారిందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని.. అందుకే మీరు యాత్రను సమర్థించారని చెప్పారు.

తాను యాత్ర పూర్తి చేసిన తర్వాత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన ఆ యాత్రలో బలహీనులకు, పేదలకు అండగా ఉంటామనే భరోసా ఇచ్చారని రాహుల్ ప్రశంసించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాను. కొత్తగా పార్టీలో చేరిన వారిన వారందరినీ అభినందిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారికి పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మా ఐడియాలజీ నచ్చిన వారు కూడా కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు.

పేదలకు లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్‌ది : మల్లు భట్టి విక్రమార్క

పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఒక్క ఎకరం కూడా పంచలేదని మండిపడ్డారు. ఇందిరా గాంధీ హయాంలో దాదాపు 24 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టామని అన్నారు. రాష్ట్ర ప్రజల బాధలను తెలుసుకోవడానికే పీపుల్స్ మార్చ్ చేశారని భట్టి పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తాను కష్టంలో ఉన్నప్పుడు ప్రజలే మేమున్నామని ధైర్యం ఇచ్చారని పొంగులేటి అన్నారు. 2014లో తెలంగాణ బిడ్డల ఆత్మాభిమానాన్ని గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. యువకుల బలిదానాలు ఆపడానికి.. పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. ప్రజలందరి దీవెనలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లు అన్నీ అమలు చేస్తుందని పొంగులేటి చెప్పారు.

First Published:  2 July 2023 7:59 PM IST
Next Story