బండి సంజయ్ నోట.. బుల్డోజర్ మాట
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. అలాంటప్పుడు బుల్డోజర్ ప్రభుత్వం తెస్తామంటున్న బండి సంజయ్ మాటల్ని సొంతపార్టీ నేతలే తప్పుబడుతున్నారు.
తెలంగాణ బీజేపీ కీలక నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి పోటీకి దిగారు. అయితే తన నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతటా తిరిగి ఆ పార్టీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ భూకబ్జాలు, అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించే బుల్డోజర్ ప్రభుత్వం కావాలా..? భూకబ్జాల ప్రభుత్వం కావాలా అని ఘాటుగా కామెంట్ చేశారు.
యూపీలో బీజేపీ బుల్డోజర్ ప్రభుత్వం
యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలతో బాగా పాపులరయింది. రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లను అరికట్టి, యూపీని ప్రశాంతంగా ఉంచుతానంటూ యోగి ఏకంగా వారి ఇళ్ల మీదకు బుల్డోజరే నడిపిస్తుంటారు. ఓపక్క ఎన్‌కౌంటర్లు, మరోపక్క ఇళ్లమీదకు దూసుకొచ్చే బుల్డోజర్లతో అక్కడి రౌడీమూకలు వణికిపోయి రౌడీయిజం వదిలేస్తున్నాయి. దీన్ని తర్వాత బీజేపీ పాలిత మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది.
తెలంగాణలో అంత సీనుందా..?
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. అలాంటప్పుడు బుల్డోజర్ ప్రభుత్వం తెస్తామంటున్న బండి సంజయ్ మాటల్ని సొంతపార్టీ నేతలే తప్పుబడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బుల్డోజర్ సంస్కృతి తేవాలనుకుంటున్నారా..? అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జనాన్ని చూసి ఏదో ఒకటి మాట్లాడాలనే ఆత్రంలో బండి అలాంటి మాటలు మాట్లాడేస్తుంటారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.