Telugu Global
Telangana

తెలంగాణలో బీజేపీ ఈ సారి కూడా అధికారంలోకి రాదు : అసదుద్దీన్ ఓవైసీ

ఎన్ని వ్యూహాలు రచించినా బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

తెలంగాణలో బీజేపీ ఈ సారి కూడా అధికారంలోకి రాదు : అసదుద్దీన్ ఓవైసీ
X

తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి కూడా బీజేపీ అధికారంలోకి రాదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వకుండా చేయడంలో మా పాత్ర కూడా కొంచెం ఉందని ఆయన తెలిపారు. ఎంఐఎం పార్టీ తొలి జాతీయ సదస్సును ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఓవైసీ పలు విషయాలు వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీకి 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికీ తెలుసు. ఈ సారి డిసెంబర్‌లో కూడా అదే రిజల్ట్ పునరావృతం అవుతుందని ఓవైసీ అన్నారు. వంటలో కాస్త ఉప్పు కలిపినట్లు.. బీజేపీ ఓటమికి మా పార్టీ పాత్ర కూడా కొంచెం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్ని వ్యూహాలు రచించినా బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని ఆయన వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన మేరకు సీట్లు గెలుచుకుంటామని ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు మార్పడంపై ఓవైసీ మండిపడ్డారు. దీనిపై ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పోరాటం చేస్తారని ఓవైసీ పేర్కొన్నారు. ఆయా నగరాల్లో మెజార్టీ ప్రజలు పేరు మార్పిడిని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో వేసిన కేసు బాంబే హైకోర్టులో నడుస్తుంది. కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడను అని ఓవైసీ అన్నారు. మీరు ఆ నగరాల పేర్లు మార్చగలరేమో కానీ దాని చరిత్రను మార్చలేరని అన్నారు. రెండు ముఖ్యమైన వారసత్వ కట్టడాలు ఉన్న ఏకైక నగరం ఔరంగాబాద్ అని ఆయన చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వం తాము న్యాయవ్యవస్థ కంటే ఎక్కువ అనే భ్రమలో ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. వాళ్లకు కూడా ఇందులో బాధ్యత ఉన్నదని ఓవైసీ చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ కన్వెన్షన్‌కు హాజరయ్యారు. దాదాపు 1200 మంది ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కీలకమైన తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సోషల్ మీడియా వర్క్‌షాప్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  26 Feb 2023 8:45 AM IST
Next Story