నన్ను పార్టీ బహిష్కరించదు..బండి సంజయ్ పై నమ్మకముంది -రాజాసింగ్ ధీమా
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో తనను పార్టీ వదులుకోబోదంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనకు బండి సంజయ్ పై పూర్తి నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఓ నాటకం అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ ఇవ్వాళ్ళ మాట్లాడిన మాటలు విపక్షాల ఆరోపణలకు ఊతం ఇస్తున్నాయి.
తననుపార్టీ బహిష్కరించబోదని, తన వెనక బండి సంజయ్ ఉన్నారని, ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు తాను జవాబు ఇస్తానని, తన జవాబుతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆయన అన్నారు. ''నన్ను పార్టీ వదులుకోదు. బండి సంజయ్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది'' అని రాజా సింగ్ అన్నారు.
కాగా స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ కామెడీ షో హైదరాబాద్ లో జరిగినప్పటి నుంచి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దాడులు చేస్తాం, కొడతాం అని వ్యాఖ్యలు చేసిన ఆయన చివరకు మునావర్ షోను ఆపలేకపోవడంతో ఆక్రోశంతో స్పందించారు . మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లోగా జవాబివ్వాలని బీజెపి అధిష్టానం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ సస్పెండ్, నోటీసులు అన్నీ పెద్ద డ్రామా అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాజా సింగ్ మాట్లాడిన మాటలు చూస్తే విపక్షాల మాటలునిజమే అనిపిస్తున్నాయి.