తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు.. నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అప్పుడప్పుడు పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి గురించి వివరించారు.
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు ఒకవైపు.. అధిష్టానం మరోవైపు పదే పదే చెబుతూ వస్తోంది. బీఆర్ఎస్‌ను గద్దె దించి.. బీజేపీ తెలంగాణ పగ్గాలు చేపడుతుందని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. కానీ సాక్షాత్తూ బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మాత్రం ఆ పార్టీ గాలి తీసేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో నాయకుల గ్రూపు తగాదాలతో అధిష్టానం తల పట్టుకుంది. తాజాగా నితిన్ గడ్కరి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అప్పుడప్పుడు పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి గురించి వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అన్నీ అనుకూలిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడి ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని.. కానీ, పార్టీ ఎన్నికల లోపు మరింతగా బలపడుతుందని గడ్కరి అంచనా వేశారు. ఈ సారి మరిన్ని సీట్లు గెలుచుకొని.. ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని గడ్కరి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గడ్కరి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని గుర్రుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి రాదేమోననే అనుమానంతో చాలా మంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి సమయంలో గడ్కరి వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాల కారణంగా పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కొత్తగా పార్టీలో చేరినవారికి ప్రాధాన్యత దక్కడం లేదని అలక బూనారు. కొంత మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో గడ్కరి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని రాష్ట్ర నాయకులు అంటున్నారు. త్వరలో ప్రధాని మోడీ బహిరంగ సభ జరుగనున్నది. దీని కోసం భారీగా జన సమీకరణ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సమయంలో గడ్కరి వ్యాఖ్యలు అడ్డంకిగా మారాయని అంటున్నారు. ప్రజల్లోకి ఈ వ్యాఖ్యలు విస్తృతంగా వెళ్తే.. ఇక సభలు, సమావేశాలకు ఎందుకు హాజరవుతారని ఆందోళన చెందుతున్నారు. గడ్కరి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కొంత మంది బీజేపీ నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.