Telugu Global
Telangana

దశాబ్ది ఉత్సవాలకోసం బీజేపీ పోటీ.. తెరపైకి రాజ్ భవన్

ఈనెల 2వతేదీ ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. అయితే అంతకు ముందే రాజ్ భవన్ లో జెండా వందనం చేసేందుకు గవర్నర్ తమిళిసై సిద్ధమయ్యారు.

దశాబ్ది ఉత్సవాలకోసం బీజేపీ పోటీ.. తెరపైకి రాజ్ భవన్
X

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల విషయంలో బీజేపీకి ఏం చేయాలో తోచడంలేదు. అధికార బీఆర్ఎస్ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్ణయించింది. 21రోజులపాటు అట్టహాసంగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమంలో మమేకం అవుతారు. ప్రజల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండేలా కార్యక్రమాలను రూపొందించారు. అటు కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇచ్చింది తామేనంటూ ప్రజల్లోకి వెళ్తోంది. మధ్యలో బీజేపీ ఏం చేస్తుంది..? హడావిడిగా ఇప్పుడు రెండురోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీజేపీ అధిష్టానం. మధ్యలో తెలంగాణ రాజ్ భవన్ ని కూడా తెరపైకి తెచ్చారు. రాజ్ భవన్ లో అవతరణ దినోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈనెల 2వతేదీ ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. అయితే అంతకు ముందే రాజ్ భవన్ లో జెండా వందనం చేసేందుకు గవర్నర్ తమిళిసై సిద్ధమయ్యారు. ఉదయం 9గంటల నుంచే రాజ్ భవన్ లో దశాబ్ది ఉత్సవాలు మొదలయ్యేలా ప్రణాళిక రూపొందించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి శుభాకాంక్షలు తెలియజేయడానికి సమయం కేటాయించారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజానీకంతో పాటు వివిధ ప్రజా సంఘాలు, ఆర్గనైజేషన్లు, సొసైటీల ప్రతినిధులను ఆహ్వానించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా తొలిసారి అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించబోతోంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వివిధ రాష్ట్రాల రాజ్‌ భవన్‌ లలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను దేశ వ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్ లలో జరుపుతామన్నారు కిషన్ రెడ్డి. మొత్తమ్మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది.

First Published:  1 Jun 2023 9:17 AM IST
Next Story