Telugu Global
Telangana

పరువు పోగొట్టుకున్న బీజేపీ అధిష్టానం.. ముఖం చాటేసిన మోడీ, అమిత్ షా

ఆపరేషన్ ఆకర్ష్ అట్టర్ ఫ్లాప్ అవడంతో బీజేపీ అధిష్టానం పరువంతా పోయింది. పెద్ద తలకాయలే ఇన్వాల్వ్ అయినట్లు తెలియడంతో వారంతా సైలెంట్ అయిపోయారు.

పరువు పోగొట్టుకున్న బీజేపీ అధిష్టానం.. ముఖం చాటేసిన మోడీ, అమిత్ షా
X

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఒక వేళ నిజంగానే సక్సెస్ అయ్యుంటే.. ఆ పార్టీ చేసే హడావిడికి పగ్గాలే ఉండేవి కావు. రాష్ట్ర నాయకులకు 'చేత కాదు' అని చెప్పి మరీ చేసిన ఆపరేషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టీఆర్ఎస్ పార్టీని కకావికలం చేయబోతున్నామనే సోయిలో.. తామే పరువు పోగొట్టుకోబోతున్నామని బీజేపీ అధిష్టానం కూడా ఊహించలేదు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోశ్‌.. జాతీయ కార్యదర్శి సునిల్ బన్సల్‌‌ ఈ ఆపరేషన్ వెనుక ఉన్నట్లు ఆడియో రికార్డులు, పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందే ఎమ్మెల్యేలను గుంజేసి.. నెలాఖరులో బహిరంగ సభ పేరుతో తెలంగాణలో గందరగోళం సృష్టించాలని ప్లాన్ చేసింది. కానీ మొత్తానికే బొక్కాబోర్లా పడింది.

ఆపరేషన్ ఆకర్ష్ అట్టర్ ఫ్లాప్ అవడంతో బీజేపీ అధిష్టానం పరువంతా పోయింది. పెద్ద తలకాయలే ఇన్వాల్వ్ అయినట్లు తెలియడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. ఈ విషయం తెలియని రాష్ట్ర నాయకులు యాదాద్రిలో ఒట్లు, సీబీఐ ఎంక్వైరీ అంటూ రెచ్చి పోయారు. తీరా ఇదంతా తమ పార్టీ అగ్రనాయకుల కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టం కావడంతో తేలు కుట్టిన దొంగల్లా కిక్కురుమనట్లేదు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఎల్లుండితో ముగియనున్నది. ఈ మూడు రోజులు ప్రచారంలో కీలకం కానుంది. కానీ, ఇప్పుడు బీజేపీ నాయకులు అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. వెళ్తే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.

దేశంలో ఎన్నికలు జరిగే సమయంలో ఇతర పార్టీ నాయకులను భయపెట్టో, డబ్బులు కుమ్మరించో బీజేపీలోకి చేర్చుకుంటారు. ఇక తమ పార్టీ అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరారని ప్రధాని మోడీ గప్పాలు కొట్టుకుంటుంటారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని ఇలాంటి మాటలు ఎప్పుడూ చెబుతుంటారు. అమిత్ షా, జేపీ నడ్డా కూడా గొప్పలు చెప్పుకోవడంలో ముందుంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక పార్టీలో చేరి ఉంటే.. ఈ ముగ్గురు తప్పకుండా మరోసారి బీజేపీ పార్టీని పొగుడుతూ భారీ ప్రసంగాలు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే సరికి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు.

మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసింది. జేపీ నడ్డా ఈ సభకు హాజరుకావల్సి ఉన్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఏకంగా సభనే రద్దు చేసుకున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఓ బహిరంగ సభను రద్దు చేసుకోవడం ఇదే తొలి సారి. ఆపరేషన్ ఆకర్ష్ కనుక సక్సెస్ అయి ఉంటే మోడీ కూడా వచ్చే అవకాశం ఉండేది. కనీసం అమిత్ షా అయినా బహిరంగ సభకు వచ్చి బీజేపీ బలపడుతోందంటూ ప్రసంగించే వారు. టీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేసే వారు. కానీ వారి ప్రణాళికలన్నింటినీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుగ్గి పాలు చేశారు.

దేశంలో ఇన్ని ఆపరేషన్లు సక్సెస్‌ఫుల్‌గా చేసిన బీజేపీ అధిష్టానానికి తెలంగాణ మాత్రం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మొన్నటి వరకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపు అన్నట్లుగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లుగా విర్రవీగారు. బీజేపీకి రాష్ట్రంలో అంత బలం ఉంటే నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి బేరసారాలెందుకనే చర్చ జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో తమకు తగినంత బలం లేకపోవడం వల్లే ఇలా ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తోందనే విషయం దీంతో స్పష్టం అయ్యింది.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటన తర్వాత బీజేపీ అధిష్టానం పరువు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా.. రాష్ట్ర నాయకులు చేతకాని వాళ్లుగా ముద్ర పడింది. ఇక్కడి నాయకులకు అధిష్టానం ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని కూడా వెల్లడైంది. అంతే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగినన్ని సీట్లు గెలుచుకోలేదనే విషయం అధిష్టానానికి కూడా అర్థంమయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమాజం ముందు బీజేపీ అధిష్టానం పోయిన పరువు తిరిగి రావాలంటే మరింత సమయం పట్టక తప్పదు.

First Published:  29 Oct 2022 9:00 AM IST
Next Story