Telugu Global
Telangana

బీజేపీ ముక్త్ భారత్.. బాగా కాలినట్టుందే..!

ఇప్పుడు బీజేపీ ముక్త్ భారత్ అనే మాట వినపడే సరికి కాషాయదళం కంగారు పడిపోతోంది. అసలా మాట అనడానికి నోరెలా వచ్చిందంటూ మండిపడుతోంది. బీజేపీ ముక్త్ భారత్ అనే పిలుపు హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్.

బీజేపీ ముక్త్ భారత్.. బాగా కాలినట్టుందే..!
X

అప్పట్లో కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ నేతలు ఓ స్లోగన్ ఇచ్చారు. అదేంటి కాంగ్రెస్ ని లేకుండా చేయడమేంటి, రాజకీయాల్లో మరీ అంత గుత్తాధిపత్య ధోరణి పనికిరాదేమో అనే కామెంట్లు వినిపించాయి. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ గింజుకోలేదు, అసలా మాట ఎలా అంటారంటూ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోనూలేదు. కానీ ఇప్పుడు బీజేపీ ముక్త్ భారత్ అనే మాట వినపడే సరికి కాషాయదళం కంగారు పడిపోతోంది. అసలా మాట అనడానికి నోరెలా వచ్చిందంటూ మండిపడుతోంది. బీజేపీ ముక్త్ భారత్ అనే పిలుపు హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంటర్లపై కంగారు పడుతున్నారు.

బీజేపీ సూర్యుడిలాంటిదని, దానిపై ఉమ్మేయొద్దని అంటున్నారు తరుణ్ చుగ్. బీజేపీ ముక్త్ భారత్ అనే పిలుపుతో ఆయన తెగ గింజుకుంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని అన్నారు. బీజేపీపై కేసీఆర్ కు ఎందుకంత కోపం అని ప్రశ్నిస్తున్నారు. రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచ నాయకుడిగా మన్ననలు పొందుతున్న ప్రధాని మోదీని కేసీఆర్ ఎందుకు శత్రువుగా భావిస్తున్నారని అన్నారు. అయితే బీజేపీ ముక్త్ భారత్ కి సమాధానంగా మోదీని వెనకేసుకొస్తూ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ఇప్పుడు కౌంటర్లు పడుతున్నాయి.

లాక్ డౌన్ సమయంలో, ఆ తర్వాత ఉచిత రేషన్ ఇచ్చామంటున్నారు తరుణ్ చుగ్. పేదలకు ఆహారం అనేది ప్రాథమిక హక్కు అని, లాక్ డౌన్ కాలంలో పని లేకుండా చేసిన ప్రభుత్వానికి అన్నం పెట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 211కోట్ల ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చారంటున్న తరుణ్ చుగ్ కి.. వ్యాక్సిన్లకు పెట్రోల్ రేట్లకు లింకు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ప్రజలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను అడ్డదిడ్డంగా పెంచి అందులో 10 శాతం వ్యాక్సిన్లకు విదిల్చిన కేంద్రం ఏ మొహం పెట్టుకుని ఫ్రీ వ్యాక్సిన్ అనే మాట చెబుతుందని మండిపడుతున్నారు. 12కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామంటున్న కేంద్రం, కనీసం వాటిని రీఫిల్ చేసుకుంటున్నారా లేదా అనే విషయం కూడా చెక్ చేసుకోలేదని చెబుతున్నారు. 12కోట్ల మరుగుదొడ్లు, 2 కోట్ల ఇళ్లు.. దేశ జనాభాకు ఏమూలకు సరిపోతాయని నిలదీస్తున్నారు.

ఎక్కడికక్కడ స్థానిక పార్టీలను మింగేసేలా పొలిటికల్ గేమ్ ఆడుతున్న బీజేపీ అదే పొలిటికల్ గేమ్ కి బలికావాల్సిన సందర్భం ఎంతో దూరంలో లేదని అంటున్నాయి వైరి వర్గాలు. ఇప్పటికే మోదీ అసమర్థత పలు సందర్భాల్లో రుజువైందని, కరోనా కష్టకాలం అంటూ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నాలు కూడా ఫలించలేదని, 2024లో మోదీకి కచ్చితంగా ప్రజలు గుణపాఠం చెబుతారని అంటున్నారు. అదే నిజమైతే బీజేపీ ముక్త్ భారత్ కి ఇంకా రెండేళ్లే టైముంది.

First Published:  3 Sept 2022 1:38 PM GMT
Next Story