Telugu Global
Telangana

స్వామీజీలపై తప్పుడు ప్రచారమంటూ బండి డైవర్షన్ గేమ్..

అసలు హిందూ సమాజానికి, ఆపరేషన్ కమల్ కి సంబంధం ఏముంది..? బేరసారాల కోసం స్వామీజీలను పిలిపించుకున్నప్పుడు లేని బాధ, వారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకొచ్చింది..? అని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

స్వామీజీలపై తప్పుడు ప్రచారమంటూ బండి డైవర్షన్ గేమ్..
X

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే విషయంలో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురిలో ఇద్దరు స్వామీజీలు ఉండటం విశేషం. స్వామీజీలంటే గుర్తొచ్చే పార్టీ ఏంటో అందరికీ తెలుసు. స్వామీజీల ద్వారా స్వామికార్యం, స్వకార్యం కూడా సాధించుకోవాలనుకున్నవారి ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టడంతో ఇప్పుడు బండి సంజయ్ డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. స్వామీజీలు, సాధుసంతులపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని, సనాతన ధర్మం, హిందూధర్మంపై తప్పుడు సంకేతాలు ఇచ్చే కుట్రలో భాగంగా ఇదంతా జరిగిందని ఆరోపించారు. దీన్ని హిందూ సమాజం క్షమించదని అన్నారు సంజయ్.

పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలో రామచంద్రభారతి, సింహయాజి స్వామీజీలు కాగా, నందకుమార్‌.. కేంద్ర మంత్రికి బంధువు అని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఫోకస్ ఈ స్వామీజీలపై పెట్టింది. అసలు హిందూ సమాజానికి, ఆపరేషన్ కమల్ కి సంబంధం ఏముంది..? బేరసారాలకోసం స్వామీజీలను పిలిపించుకున్నప్పుడు లేని బాధ, వారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకొచ్చింది. స్వామీజీలను అరెస్ట్ చేశారు, హిందూ ధర్మంపై తప్పుడు సంకేతాలిస్తున్నారంటూ బండి సంజయ్ మాట్లాడటం డైవర్షన్ గేమ్ లో భాగమేనంటున్నారు టీఆర్ఎస్ నేతలు. గుట్టు రట్టయ్యే సరికి ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

డబ్బు సంచులు నిజం, ఫామ్ హౌస్ లో బేరాలు జరిగింది నిజం, బేరాలు చేసినవారు బీజేపీవారనేది కూడా నిజం. కానీ బీజేపీ ఇంకా నిజం ఒప్పుకునేలా లేదు. గుట్టురట్టయిన వెంటనే మీడియా ముందుకొచ్చిన బండి సంజయ్, అసలు ఎమ్మెల్యేలను కొనే ఖర్మ తమకేంటని అన్నారు. మరి ఏ అవసరంతో కర్నాటకలో, మహారాష్ట్రలో, గోవాలో ఎమ్మెల్యేలను బీజేపీ కొన్నదో ఆయన చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. తప్పు బయటపడింది కాబట్టి ఇలా తప్పించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో ఆపరేషన్ కమల్ విఫలం కావడంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవడంలేదంటున్నారు.

First Published:  27 Oct 2022 8:35 AM IST
Next Story