Telugu Global
Telangana

హైదరాబాద్ లోక్‌సభ సీటును టార్గెట్ చేసిన బీజేపీ.. ఈ నెల ఆఖరి వారంలో కీలక సమావేశం

హైదరాబాద్, అదిలాబాద్‌లో ఫోకస్ చేసిన పార్టీ.. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేయనున్నది.

హైదరాబాద్ లోక్‌సభ సీటును టార్గెట్ చేసిన బీజేపీ.. ఈ నెల ఆఖరి వారంలో కీలక సమావేశం
X

కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా.. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, మరి కొన్ని ఉపఎన్నికల్లో ఓటమి పాలవడంపై పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు గతంలో కంటే తగ్గుతాయని బీజేపీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా యూపీ, బీహార్ రాష్ట్రాల్లో తాము గతంలో గెలిచిన వాటి కంటే తక్కువే గెలుస్తామని భావిస్తున్నది. అందుకే ఆ మేరకు దక్షిణాదిలో గెలవాలని టార్గెట్ పెట్టుకున్నది.

కర్ణాటకలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో బీజేపీకి మంచి ఓటు బ్యాంకే ఉన్నది. ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను పక్కన పెడితే రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలపై అధిష్టానం దృష్టి పెట్టింది. హైదరాబాద్, అదిలాబాద్‌లో ఫోకస్ చేసిన పార్టీ.. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేయనున్నది. ఈ నెల 28, 29న హైదరాబాద్ వేదికగా 'పార్లమెంటరీ విస్తారక్'ల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కీలక సమావేశాలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. విస్తారక్‌ల భేటీలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 80లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్ష జరుగనున్నది.

హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరుగనున్నట్లు తెలుస్తున్నది. గత 38 ఏళ్లుగా ఓవైసీ కుటుంబమే హైదరాబాద్ సీటును గెలుస్తూ వస్తోంది. 1984లో తొలి సారిగా సలావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్‌గా హైదరాబాద్ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన ఎంఐఎంను ఏర్పాటు చేశారు. 2004 వరకు సలావుద్దీన్.. ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీలుగా గెలిచారు. ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎంఐఎం అభ్యర్థులే ఎక్కువగా గెలుస్తున్నారు. ప్రస్తుతం ఒక్క గోషామహల్ తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలే ఉన్నారు.

ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని బీజేపీ నిర్ణయించుకున్నది. మజ్లిస్ పార్టీని దెబ్బతీయాలంటే.. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ను హైదరాబాద్‌లో ఓడించడం ఒక్కటే మార్గమని కాషాయపార్టీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఏం చేయాలనే వ్యూహాన్ని ఈ నెలాఖరులో జరిగే విస్తారక్ సమావేశాల్లో చర్చించనున్నారు. దీంతో పాటు అదిలాబాద్ లోక్‌సభ సీటుపై కూడా చర్చ జరుగనున్నది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఎంపీనే ఉన్నారు. అయితే సోయం బాపూరావుపై ఇటీవల తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఆయన గెలుపు ఈ సారి కష్టమే అనే వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో బీజేపీ కూడా కాస్త బలహీన పడినట్లు సర్వేల్లో తేలింది. అందుకే విస్తారక్ భేటీలో హైదరాబాద్, అదిలాబాద్‌లపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తున్నది.

దీంతో పాటు బీజేపీ ఎంపీలు లేని లోక్‌సభ స్థానాలపై స్వల్ప చర్చ జరగవచ్చునని తెలుస్తున్నది. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కవగా ఉన్న లోక్‌సభ స్థానాలపై దృష్టి పెట్టనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తిగా 2024లో గెలవాల్సిన లోక్‌సభ స్థానాల్లో పార్టీ బలాబలాలను విశ్లేషించనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  10 Dec 2022 3:27 AM GMT
Next Story