రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజెపి
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ బీజేపీ ఎంఎల్ ఏ రాజా సింగ్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పది రోజుల్లోగా వివరంగా జవాబు చెప్పకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం కార్యదర్శి ఓం పాఠక్ లేఖ రాశారు.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి రాజా సింగ్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. అతని పై దాడులు చేస్తామని, ప్రవక్త గురించి నూపుర్ శర్మ మాట్లాడిన మాటలు నేను కూడా మాట్లాతానని అంటు వస్తున్నాడు. చివరకు ఆ అంశం చిలికి చిలికి గాలివానలా మారి నిన్న రాజా సింగ్ మహ్మద్ ప్రవక్త గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. దాంతో తెలంగాణ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ నాయకత్వం రాజా సింగ్ పై చర్యలు తీసుకుంది. గతంలో నూపుర్ శర్మ ఇవే మాటలు మాట్లాడినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. చివరకు అంతర్జాతీయ సమాజానికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బీజేపీ అధికారప్రతినిధి అయిన నూపుర్ శర్మను పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. ప్రపంచ వ్యాప్తంగా ఇంత రచ్చ జరిగాక కూడా రాజాసింగ్ మళ్ళీ అవే మాటలు మాట్లాడటం చూస్తూ ఉంటే ఇదంతా ప్రణాళికబద్దంగా జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.