Telugu Global
Telangana

మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ వేటు..!

మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ సైతం వీరికి టికెట్స్ ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉందన్న టాక్ నడుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ వేటు..!
X

తెలంగాణ బీజేపీలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్జి ఓ ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఇటీవల కాలంలో బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి రెండో వ్యక్తి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడంపై జిట్టా బాలకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇటీవలే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు జిట్టా. అంతేకాకుండా కిషన్‌ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని.. ఆయనకు బీఆర్ఎస్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌ చేసిన ఒకట్రెండు రోజులకే జిట్టాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఇక యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ సైతం వీరికి టికెట్స్ ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉందన్న టాక్ నడుస్తోంది. మహబూబ్ నగర్ నుండి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఢీకొట్టాలంటే.. అక్కడ స్థానికంగా ఉన్న గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి.. అందుకోసం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డినే ఎంచుకున్నారని తెలుస్తోంది. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే వార్తల నేపథ్యంలోనే బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

*

First Published:  4 Sept 2023 9:47 AM IST
Next Story