Telugu Global
Telangana

వెంకట్‌రెడ్డి కూడా టచ్‌లోనే.. - బండి సంజయ్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమకు టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పోతే తమకు పార్టీలో ఎదురుండదని రేవంత్ వర్గీయులు భావిస్తున్నట్టు సమాచారం.

వెంకట్‌రెడ్డి కూడా టచ్‌లోనే.. - బండి సంజయ్
X

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు మొదలయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజగోపాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంటే.. కోమటిరెడ్డి తన లాభం చూసుకొని పార్టీ మారారని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి అనే బ్రాండ్ మీద కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నొచ్చుకున్నారు. రేవంత్ క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమకు టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పోతే తమకు పార్టీలో ఎదురుండదని రేవంత్ వర్గీయులు భావిస్తున్నట్టు సమాచారం.

కానీ, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పవర్ ఫుల్ నేతలు. వారు అక్కడ చాలా నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు. అయితే ఇటీవల అధిష్టానం కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆయన చాలా రోజులుగా బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నారు. కాబట్టి రాజకీయ విశ్లేషకులు పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ.. కరుడు గట్టిన కాంగ్రెస్ వాది అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారా? అన్న వార్త చర్చనీయాంశం అయ్యింది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ కాస్తో.. కూస్తో బలంగా ఉంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెద్దగా ఆ పార్టీ బలంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన నేతలను చేజార్చుకోవడం ఏమంత మంచిది కాదన్నది విశ్లేషకుల భావన.

First Published:  4 Aug 2022 5:44 PM IST
Next Story