Telugu Global
Telangana

యాత్ర కాదు ప్రచారమే.. అధిష్టానం దెబ్బకు దిగొచ్చిన బండి సంజయ్

మునుగోడు పరిస్థితి ముందే తెలిసిన సంజయ్.. ప్రచారానికి దూరంగా ఉండాలనే యాత్ర ప్లాన్ వేసినట్లు చర్చ జరుగుతున్నది.

యాత్ర కాదు ప్రచారమే.. అధిష్టానం దెబ్బకు దిగొచ్చిన బండి సంజయ్
X

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకొని పోతుంటే.. అక్కడ ఎన్నికకు కారణమైన బీజేపీ మాత్రం అంత ఉత్సాహంగా కనపడటం లేదు. మొదట్లో అమిత్ షా సభ అంటూ హడావిడి చేసినా.. రోజులు గడుస్తున్న కొద్దీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అర్థం కావడంతో రాష్ట్ర నాయకులు మొఖం చాటేశారు. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి జి. వివేక్‌ను ఇంచార్జిగా నియమించారు. ఇక మండలానికి ఒక బాధ్యుడిని కూడా బీజేపీ నియమించింది. కానీ ఎవరూ పూర్తి స్థాయిలో పని చేయడం లేదని తెలుస్తున్నది. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కరే కాస్త క్షేత్ర స్థాయలో తిరుగుతూ జనాలను సమీకరించే పనిలో పడ్డారు. ఇక స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న మొన్నటి దాకా ఢిల్లీలోనే మకాం వేశారు.

ఒక వైపు మునుగోడు ఉపఎన్నిక ఉన్నా.. తాను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని భావించారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఒక దఫా తిరిగిన బండి.. ఆ తర్వాత వెస్ట్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో తిరగాలని అనుకున్నా. అయితే ఉపఎన్నిక రావడంతో మునుగోడు నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని ప్లాన్ చేశారు. యాత్రకు మొదటి నుంచి ఇంచార్జిగా ఉన్న గంగిడి మనోహర్ రెడ్డి మునుగోడుకు చెందిన వ్యక్తే. ఆయన గత ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. దీంతో తన పాదయాత్ర అక్కడ కొనసాగించడానికి అధిష్టానాన్ని ఒప్పించడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే, అధిష్టానం మాత్రం యాత్రకు ఇప్పుడు అనుమతి ఇచ్చేది లేదని.. వెంటనే వెళ్లి మునుగోడులో ప్రచారం చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సంజయ్.. ఇక ప్రచారంలో దిగాలని నిర్ణయించుకున్నారు.

మునుగోడు పరిస్థితి ముందే తెలిసిన సంజయ్.. ప్రచారానికి దూరంగా ఉండాలనే యాత్ర ప్లాన్ వేసినట్లు చర్చ జరుగుతున్నది. తాను నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేసిన తర్వాత ఓడిపోతే ఆ నింద తానే మోయాల్సి వస్తుందని సంజయ్ భయపడినట్లు తెలుస్తున్నది. అందుకే యాత్ర పేరుతో తిరిగితే.. ఆ తర్వాత ఓడినా పెద్దగా నస్టం ఉండదని స్కెచ్ వేశారు. కానీ అధిష్టానం ఆయన వ్యూహాలకు బ్రేకులు వేసింది. దీంతో చేసేదేమీ లేక ఇవ్వాల్టి నుంచి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గుండ్లపల్లి, థమ్మాడపల్లి గేట్ వద్ద ఆయన ప్రచారం ప్రారంభం కానున్నది.

మధ్యాహనం కొండూరులో ప్రచారం చేసిన అనంతరం.. సాయంత్రం నాలుగు గంటలకు మర్రిగూడ క్రాస్ రోడ్డు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. బండి సంజయ్‌తో పాటు మిగిలిన సీనియర్ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనాలని అధిష్టానం ఆదేశించడంతో డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా తిరగడానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు నాయకుల చేరికలపై దృష్టి పెట్టిన రాజేందర్.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. డీకే అరుణ చండూరు మండలంలో ఈ రోజంతా ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న బీజేపీ నేతలకు అధిష్టానం చురుకు అంటించడంతో కదనరంగంలోకి కాలు పెడుతున్నారు.

First Published:  18 Oct 2022 10:30 AM IST
Next Story