Telugu Global
Telangana

కీలకంగా మారిన తెలంగాణ.. బీజేపీ అగ్ర నేతల క్యూ

బీజేపీకి తెలంగాణ నుంచి కొత్తగా సీట్లు రాకపోయినా కాంగ్రెస్ మెజార్టీ పెరిగితే కేంద్రంలో ఇబ్బంది వస్తుంది. అందుకే ఈసారి తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు కమలనాథులు.

కీలకంగా మారిన తెలంగాణ.. బీజేపీ అగ్ర నేతల క్యూ
X

తెలంగాణ రాష్ట్రం బీజేపీకి కీలకంగా మారింది. ఇన్నాళ్లూ ఇక్కడ బీఆర్ఎస్ డామినేషన్ ఉండేది. బీఆర్ఎస్ తమతోపాటు కాంగ్రెస్ కి కూడా దూరంగా ఉంటుంది కాబట్టి బీజేపీకి పెద్దగా నష్టం లేదు. ఇప్పుడిక్కడ కాంగ్రెస్ హవా మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఊపు కొనసాగితే అది కేంద్రంలోని బీజేపీకి నష్టం. బీజేపీకి తెలంగాణ నుంచి కొత్తగా సీట్లు రాకపోయినా కాంగ్రెస్ మెజార్టీ పెరిగితే కేంద్రంలో ఇబ్బంది వస్తుంది. అందుకే ఈసారి తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ హడావిడి చేసింది. కానీ మధ్యలోనే కాడె పడేసినట్టు నాయకుల్లో నైరాశ్యం నెలకొంది, ఫలితం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ముందు కూడా ఇప్పుడీ హడావిడి మొదవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగానే ఆదిలాబాద్, సంగారెడ్డిలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఈ సభలకు ప్రధాని మోదీ హాజవుతారు. స్థానికంగా రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.. మోదీ చేతుల మీదుగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వరుస పర్యటనలకు సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం 10 స్థానాలు గెలవాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఆ విషయంలో ముందడుగు..

బీఆర్ఎస్ కొన్నిచోట్ల ఇన్ చార్జ్ లకు బాధ్యతలు అప్పగించి ప్రచారం మొదలు పెట్టాలని సూచించింది. కాంగ్రెస్ లో అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ విషయంలో బీజేపీ ఇంకాస్త దూకుడుగా ఉంది. ఇప్పటికే ఆరుగురు అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. మిగతా 11మందితో తుది జాబితా విడుదలకు కసరత్తులు చేస్తోంది. ప్రచారంలోకూడా దూకుడు పెంచాలని చూస్తోంది. మార్చి 4న అమిత్ షా హైదరాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరించాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఎన్నికల వరకు వరుస సభలు జరిగే అవకాశం ఉంది.

First Published:  27 Feb 2024 8:54 AM IST
Next Story