రాజాసింగ్ కి బీజేపీ షాక్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టే..
గోషా మహల్ లో రాజాసింగ్ కి బీజేపీ ఆల్టర్నేట్ వెదికి పెట్టుకుంది. ముందస్తు ఎన్నికలొస్తే గోషా మహల్ సిట్టింగ్ స్థానం నుంచి బీజేపీ తరపున విక్రమ్ గౌడ్ లేదా భగవంత్ రావు బరిలో దిగే అవకాశాలున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పార్టీ సస్పెండ్ చేసి రెండు వారాలవుతోంది. ఆయన జైలులో ఉన్న కారణంగా వివరణ ఇచ్చుకోలేదు, ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయలేదు. మరో ఆరు నెలలు రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం కూడా లేదని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఈ దశలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తే గోషా మహల్ లో బీజేపీ అభ్యర్థి ఎవరు..? రాజాసింగ్ కి ఆల్రడీ పార్టీ ఆల్టర్నేట్ వెదికి పెట్టుకుంది. ముందస్తు ఎన్నికలొస్తే గోషా మహల్ సిట్టింగ్ స్థానం నుంచి బీజేపీ తరపున విక్రమ్ గౌడ్ లేదా భగవంత్ రావు బరిలో దిగే అవకాశాలున్నాయి.
కూరలో కరివేపాకు..
ఉప ఎన్నికల సంగతి పక్కనపెడితే.. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. కానీ ఆయనకు పార్టీలో ఆ స్థాయి పరపతి లేదు. రాష్ట్ర పార్టీపై పెత్తనం బండి సంజయ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ దూసుకు పోతుండగా రాజాసింగ్ కేవలం తన నోటిదురుసుతో వెనకపడిపోయారు. తీరా ఇప్పుడు జైలుకెళ్లారు. ఆయన పార్టీకోసమే జైలుకెళ్లారనే భావన ఆయన అభిమానుల్లో ఉంది కానీ, పార్టీ మాత్రం ఆయన్ను సస్పెండ్ చేసి షాకిచ్చింది. సస్పెన్షన్ ఎత్తివేసే విషయంలో కూడా కాస్త కఠినంగానే ఉంది. ఎంతలా అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ కి టికెట్ కూడా ఇవ్వనంతలా.
ప్రస్తుతం గోషా మహల్ పై విక్రమ్ గౌడ్, భగవంత్ రావు కర్చీఫ్ వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు. ముకేష్ గౌడ్ గతంలో రెండుసార్లు గోషా మహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో తండ్రి తరపున విక్రమ్ గౌడ్ కూడా ప్రచారం చేశారు. అలా ఆ నియోజకవర్గంతో విక్రమ్ గౌడ్ కి పరిచయం ఉంది. భగవంత్ రావ్ బీజేపీలో సీనియర్ నేత, ఆయన హైదరాబాద్ లోక్ సభకు రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన కూడా గోషామహల్ సీటు కోసం ట్రై చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి బీజేపీ గోషామహల్ టికెట్ కన్ఫామ్ చేస్తుందనే సమాచారం ఉంది. అంటే రాజాసింగ్ కి, గోషా మహల్ కి లింక్ తెగిపోతున్నట్టే లెక్క.
పొమ్మనలేక..
రాజాసింగ్ మరీ గొడవ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. 2019లో హైదరాబాద్ లోక్ సభకు రాజా సింగ్ ని పోటీకి నిలపాలని అధిష్టానం భావించినా.. ఆయన గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగడానికే ఇష్టపడ్డారు. దీంతో అధిష్టానం భగవంత్ రావు వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు గోషా మహల్ కి భగవంత్ రావుని పంపి, రాజాసింగ్ ని 2024 లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బరిలో దింపే ఆలోచన చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ స్థానం అంటే కత్తిమీద సామే. ఎంఐఎం అక్కడ బలంగా ఉంది. అసదుద్దీన్ వరుస విజయాలను నిలువరించాలంటే కష్టం. రాజాసింగ్ పోటీ చేసినా ఆయన ఓడిపోవడం ఖాయమంటున్నారు. అంటే రాజాసింగ్ కి ఆ టికెట్ ఇచ్చినా పార్టీ తరపున మేలు చేసినట్టు కాదు. ఓడిపోయే సీటు ఇచ్చి పరువు తీసినట్టే లెక్క. మొత్తమ్మీద రాజాసింగ్ ని బీజేపీ వాడుకుని వదిలేస్తోందనే విమర్శలు ఆయన అభిమానులనుంచి వినపడుతున్నాయి.