Telugu Global
Telangana

బీజేపీలోకి రేవంత్..! కాషాయదళం సెల్ఫ్ గోల్

రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఏ పార్టీకి ఎంతమేరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి.

బీజేపీలోకి రేవంత్..! కాషాయదళం సెల్ఫ్ గోల్
X

రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని, లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాయంగా జరిగే పరిణామం ఇదని ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఓ చర్చ లేవనెత్తారు. మోదీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నారని, అంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలని కూడా వారు లాజిక్ తీశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని విడిచిపెడతారా..? బీజేపీలోకి వెళ్లి పునీతులవ్వాలనుకుంటారా..? అనే విషయం పక్కనపెడితే ఆ ప్రచారంతో ? ఏ పార్టీకి ఎంత లాభం అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. అందుకే ఆ రెండు పార్టీలకు ఓటు వేయకుండా మాకే వేయండి అని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ఆరోపణలు కొంతవరకు బీఆర్ఎస్ కు లాభం చేకూర్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల బీజేపీ నేతలు కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ మాత్రం రేవంత్ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకుందనే చెప్పాలి.

రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలోకి వస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల పలు సందర్భాల్లో ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచడానికేనని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెప్పడంలో ఆంతర్యమేంటి..? అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా..? పార్టీలను చీల్చడం, రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వాలని కూల్చడం తమకు అలవాటేనని చెప్పినట్టే కదా..? అంటే ఇక్కడ బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే కదా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే అంశాలు హైలైట్ కావడం విశేషం. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్, కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ, కాదు కాదు బీజేపీ-కాంగ్రెస్ ఒకటేనని బీఆర్ఎస్ ఇలా మూడు పార్టీలు ఒకే రకమైన ప్రచారం చేశాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా అదే జరుగుతోంది. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ ప్రచారం ఏ పార్టీకి ఎంతమేరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి.

First Published:  21 April 2024 1:00 PM GMT
Next Story