టీ-హబ్ కోసం తెలంగాణతో బీజేపీ పాలిత రాష్ట్రం ఒప్పందం..
గతంలో ఐటీ అంటే బెంగళూరు పేరు వినిపించేది. కానీ ఆ బ్రాండ్ ని క్రమంగా హైదరాబాద్ ఆక్రమించేస్తోంది. ఈ క్రమంలో గోవాలో కూడా ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం తెలంగాణతో ఒప్పందం చేసుకుంది.
కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ ని అనుసరిస్తున్నాయి. తెలంగాణతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా బీజేపీ పాలిత గోవా రాష్ట్రం తెలంగాణతో ఐటీ ఒప్పందం చేసుకుంది. గోవాలో కూడా టీ-హబ్, వీ-హబ్, టాస్క్ వంటి వాటి ఏర్పాటు కోసం తెలంగాణా సాయాన్ని అభ్యర్థించింది గోవా. అవసరమైన సాంకేతికతను తమకు అందించాలని కోరింది.
ఐటీలో మేటి తెలంగాణ..
దేశంలోనే ఐటీ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఐటీ నియామకాల్లో బెంగళూరుని కూడా పక్కకునెట్టి మొదటి స్థానానికి ఎగబాకింది. ఆఫీస్ స్పేస్ ఉపయోగంలో కూడా తెలంగాణ నెంబర్-1. దీంతో సహజంగానే తెలంగాణపై అన్ని రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాయి. గతంలో ఐటీ అంటే బెంగళూరు పేరు వినిపించేది. కానీ ఆ బ్రాండ్ ని క్రమంగా హైదరాబాద్ ఆక్రమించేస్తోంది. ఈ క్రమంలో గోవాలో కూడా ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణతో ఒప్పందం చేసుకుంది.
ఐటీ కంపెనీలు, స్టార్టప్‌ల కోసం తీసుకొచ్చిన టీ-హబ్, మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటు చేసిన వీ-హబ్ తమకూ కావాలని గోవా ప్రభుత్వం తెలంగాణను అడిగింది. ఈమేరకు ఐటీ ఆభివృద్ధికి ఒప్పందం కూడా కుదిరింది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధ్యక్షతన జరిగిన ఐటీ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ ఒప్పందం గురించి ప్రత్యేకంగా చర్చించారు. 'టీ-హబ్, వీ-హబ్, టాస్క్ వంటివి గోవాలోనూ ఏర్పాటు చేసేందుకు తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు గోవా ఐటీ మంత్రి రోహన్ ఖౌంతే. డిసెంబర్ లోగా గోవాలో ఐటీ రంగంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిపై నెటిజన్లనుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఐటీ రంగంలో తెలంగాణ, భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అంటున్నారు. తెలంగాణ విజన్ అంటే ఇదేనని ప్రశంసిస్తున్నారు.