అది అంకెల గారడీ.. ఇది మాటల గారడీ
సాగునీటి ప్రాజెక్ట్ లకు కేటాయించిన నిధులు, గత ప్రభుత్వం ఆ రంగంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోవన్నారు కిషన్ రెడ్డి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పై బీజేపీ ఆచితూచి స్పందించింది. ఆరు గ్యారెంటీలను మాత్రమే టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ తో జతకడతారనే భయం బీజేపీకి ఉంది. అందుకే ఆరోగ్యశ్రీ, సాగునీటి ప్రాజెక్ట్ లు, మైనార్టీ నిధులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు బీజేపీ నేతలు. తాజా బడ్జెట్ తో కాంగ్రెస్ మోసం బట్టబయలైందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్‌ది అంకెలతో పాటు మాటల గారడీ సర్కార్ అని విమర్శించారాయన. కాంగ్రెస్ బడ్జెట్.. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని అన్నారు కిషన్ రెడ్డి.
సాగునీటి ప్రాజెక్ట్ లకు తాజా బడ్జెట్ లో కేవలం 28వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ కూడా రిపీట్ చేస్తోందని అన్నారు కిషన్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్ట్ లకు కేటాయించిన నిధులు, గత ప్రభుత్వం ఆ రంగంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోవన్నారు. రైతులకు ఇచ్చిన గ్యారెంటీల అమలుకి ఈ కేటాయింపులు చాలవని చెప్పారు. బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.11వేల కోట్లు కేటాయించారని, ఆరోగ్య శ్రీ అమలుకి ఇవి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
మైనార్టీలపై అంత ప్రేమెందుకు..?
రాష్ట్రంలో 15 శాతం ఉన్న మైనార్టీలకోసం బడ్జెట్ లో కేటాయింపులు ఘనంగా జరిగాయని, అదే సమయంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని.. మైనార్టీలపై కాంగ్రెస్ కు అంత ప్రేమెందుకని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్న హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు.. బడ్జెట్‌లో మాత్రం రూ. 7,700 కోట్లు కేటాయించారని వీటితో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.