రూ. 2లక్షల రుణమాఫీకి 6 పేజీల నిబంధనలా..?
ఎన్నికల ముందు రూ. 2 లక్షల వరకు రైతు రుణాలను ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కండిషన్లు పెట్టి అన్నదాతల్ని వేధిస్తున్నారని విమర్శించారు ఈటల.
తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నోరు మెదపడంలేదు, నిరుద్యోగుల ఆందోళనలు కూడా వారికి పట్టలేదు, తాజాగా రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో బీజేపీ తెరపైకి వచ్చింది. రుణమాఫీకి నిబంధనలు సరికాదంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రూ.2లక్షల రుణమాఫీకి 6 పేజీల నిబంధనలా..? అంటూ ప్రశ్నించారు బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్.
రుణమాఫీ విషయంలో గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన బాసలు, ఇప్పుడు పెట్టిన కండిషన్లకు పొంతన లేదని అంటున్నారు ఈటల రాజేందర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ రైతులకు ఉరితాడులా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల వరకు రైతు రుణాలను ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కండిషన్లు పెట్టి అన్నదాతల్ని వేధిస్తున్నారని విమర్శించారు ఈటల. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చిందని అన్నారాయన.
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. దాదాపు 8 నెలలు కాలయాపన చేసింది. చివరికి ఇప్పుడు నిబంధనల పేరుతో కొర్రీలు వేస్తోంది. బేషరతుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు బీజేపీ కూడా రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.