వారిద్దర్నీ ఓడించాం కదా..! ఫలితాలపై బీజేపీ రియాక్షన్
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో.. పార్లమెంట్ ఎన్నికలనాటికి పుంజుకుంటామని చెప్పారు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ ఎక్కువగా వినియోగించుకుందని వివరణ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీజేపీ కాస్త ఆలస్యంగా స్పందించింది. ఓటమి ఖాయమని ఆ పార్టీకి ముందే తెలుసు. అయినా కూడా 20 సీట్లు, 30 సీట్లు అంటూ లేనిపోని ధీమా ప్రదర్శించింది. చివరకు అవి కూడా రాలేదు. సింగిల్ డిజిట్(8) దగ్గరే తెలంగాణలో బీజేపీ ఆగిపోయింది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తమ ఓట్ల శాతం 6.9 నుంచి 14శాతానికి పెరిగిందని అన్నారు.
మోదీ నాయకత్వం మీద నమ్మకం ఉంచి బీజేపీ అభ్యర్థి శ్రీ వెంకట రమణారెడ్డి (@kvr4kamareddy) గారిని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
— G Kishan Reddy (@kishanreddybjp) December 3, 2023
On behalf of @BJP4Telangana I express heartfelt gratitude to the people of Kamareddy for showing trust in PM Shri @NarendraModi ji’s… pic.twitter.com/0ZcYnRPNCD
వాళ్లిద్దర్నీ ఓడించాం కదా..!
సిట్టింగ్ సీఎం, కాబోయే సీఎం ఇద్దర్నీ తమ పార్టీ అభ్యర్థి కామారెడ్డిలో ఓడించారని చెప్పారు కిషన్ రెడ్డి. కామారెడ్డి ప్రజలకు సెల్యూట్ అన్నారు. వెంకట రమణారెడ్డి మీద విశ్వాసం ఉంచి గెలిపించారని, కామారెడ్డి అభివృద్ది కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సీఎంలంటూ ప్రొజెక్ట్ చేసిన ఇద్దరు కీలక నేతలు ఓడిపోవడంపై మాత్రం కిషన్ రెడ్డి స్పందించలేదు. ఈ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదన్నారు. ఫలితాలపై అందరం కలిసి సమీక్షించుకుంటామని చెప్పారు.
పార్లమెంట్ కి పుంజుకుంటాం..
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో.. పార్లమెంట్ ఎన్నికలనాటికి పుంజుకుంటామని చెప్పారు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ ఎక్కువగా వినియోగించుకుందని వివరణ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ శాసన సభలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో, మధ్య ప్రదేశ్ లో కాషాయ జెండా ఎగిరిందని సంతోషం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.
♦