Telugu Global
Telangana

నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ నిరసన.. కారణం ఇదే

బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ నిరసన.. కారణం ఇదే
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య నడుస్తున్న మాటల యుద్దం.. చివరకు తెలంగాణకు పాకింది. అక్కడి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ దీనిని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఈ విషయంలో బీజేపీ తీవ్రంగా స్పందించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక ప్రజలు ఓటేసే సమయంలో 'జై బజరంగ బలీ' అంటూ ఓటేయాలని పిలుపునిచ్చారు. తాజాగా దీనిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించింది.

మూడు రోజులు కర్ణాటకలో ప్రచారం చేసి వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు 'హనుమాన్ చాలీసా' పఠనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్‌లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని చెప్పారు.

కర్ణాటకలో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఆగ్రహంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహి, హిందూ ధర్మానికి ఆపదొస్తే ముందుండి పోరాడే సంస్థ బజరంగ్ దళ్. గో రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆ సంస్థను నిషేధించాలనుకోవడం మూర్ఖమైన చర్య అని బండి సంజయ్ అన్నారు.

ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడ్డుకోకపోతే.. తెలంగాణలో కూడా బజరంగ్ దళ్‌ను నిషేధించే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారి పార్టీ కార్యాలయాలు, కాంగ్రెస్ నేతల ఇళ్ల ఎదుట హనుమాన్ చాలీసా చదువుతూ శాంతియుత నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ప్రతీ కార్యకర్త కాషాయ కండువా ధరించి నిరసన తెలపాలని.. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ హనుమాన్ చాలీసా పఠించాలని కోరారు.

First Published:  5 May 2023 7:38 AM IST
Next Story