Telugu Global
Telangana

బిజెపి చిల్ల‌ర రాజ‌కీయాలు : కొండా సురేఖ‌

ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటి పూనమ్ కౌర్ , రాహుల్ చేయి ప‌ట్టుకుని న‌డ‌వ‌డం పై బిజెపి చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఖండించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోందని ఆమె మండి పడ్డారు.

బిజెపి చిల్ల‌ర రాజ‌కీయాలు : కొండా సురేఖ‌
X

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోంద‌ని మాజీ మంత్రి కొండా సురేఖ విమ‌ర్శించారు. అధికార దాహంతో విలువ‌లు మ‌ర్చిపోయి మ‌హిళ‌లకు సంబంధించి కూడా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని ఆమె ధ్వ‌జ‌మెమెత్తారు. ఇటీవల పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్ , రాహుల్ గాంధీ చేయి ప‌ట్టుకుని న‌డ‌వ‌డం పై బిజెపి చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆమె త‌ప్పు బ‌ట్టారు. పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాలని పట్టుకోలేదని అన్నారు. వేరే ఉద్దేశంతో పబ్లిక్‌లో ఎవరైనా అమ్మాయి చేయి పట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారనేది చూడాలని.. విమర్శలు చేసేవారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌ను తల్లిగా భావిస్తుంద‌ని అన్నారు. మ‌హిళ‌ల‌కు బిజెపి ఇచ్చే గౌర‌వం ఇదేనా అని ప్ర‌శ్నించారు. వేరే ఉద్దేశంతో చూసే అల‌వాటు బిజెపి నేత‌ల‌కు ఉందేమోగానీ కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ళ‌ను ఎంతో గౌర‌విస్తుంద‌ని అన్నారు. మ‌హిళ‌ల‌ సాధికార‌త‌కు ఇందిరాగాంధీ నుంచీ సోనియా గాంధీ వ‌ర‌కూ ఎంతో పాటు ప‌డుతుంద‌న్నారు. అందుకే త‌మ‌లాంటి వాళ్ళు చ‌ట్ట‌స‌భ‌ల‌కు రాగ‌లిగామ‌ని చెప్పారు.

రాహుల్ గంధీ పాద యాత్ర‌తో తెలంగాణ‌లోనే కాక దేశ వ్యాప్తంగా విశేష స్పంద‌న వ‌స్తోంద‌న్నారు. తెలంగాణ నాయ‌కుల మ‌ధ్య విభేదాల‌ను ప్ర‌స్తావించిన‌ప్పుడు.. ఇవ‌న్నీ కుటుంబంలో త‌లెత్తే అభిప్రాయ భేదాల వంటివేన‌ని కొట్టిపారేశారు. రాహుల్ పాద యాత్ర త‌ర్వాత ప‌రిస్థితులు మారుతున్నాయ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరిగా పార్టీ నాయకులను బతిమాలుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. తెలంగాణలో ఇంతకుమందు ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని అంగీకరించారు. రాహుల్ గాంధీతో మీటింగ్ జరిగిన తర్వాత ఆ పరిస్థితులు మారాయ‌న్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంలో అధిష్టానం వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చింద‌ని గుర్తు చేశారు.

గతంలో ఇలా వెంట‌నే స్పందించిన సంఘ‌ట‌న‌లు లేవ‌న్నారు. పార్టీ క్యాండెట్ కోసమే క్యాడర్ పనిచేస్తుందని.. అధిష్టానం ప్ర‌క‌టించిన వాళ్లనే గెలిపించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. రాహుల్ పాద యాత్ర‌తో పార్టీలో నూత‌నోత్తేజం వ‌స్తుంద‌న్నారు.

First Published:  31 Oct 2022 1:00 PM IST
Next Story