సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ.. బీజేపీపై కేటీఆర్ సెటైర్
కేసీఆర్ స్థాయికి కాదు కదా.. ఆయన నీడను కూడా చేరుకునే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేదన్నారు. కేసీఆర్ లాంటి సమర్థుడెనౖ, బలమైన, దక్షత కలిగిన నాయకుడు ఉంటేనే.. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు సాగుతుందన్నారు కేటీఆర్.
తెలంగాణలో బీజేపీ అసలు తమకు పోటీయే కాదన్నారు మంత్రి కేటీఆర్. మూడోసారి కూడా బీఆర్ఎస్ కి అధికారం ఖాయమని, హ్యాట్రిక్ కొట్టి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని, అది కూడా తమకు చాలా దూరంలోనే ఆగిపోతుందని చెప్పారు. బీజేపీ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువగా కనిపిస్తుందన్నారు. పైపైన బిల్డప్ తప్ప ఏమీ లేదని తీసిపారేశారు. హైదరాబాద్ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని, దాన్ని మోదీ, షా ఎవరూ ఆపలేరని చెప్పారు కేటీఆర్. ప్రగతి రథచక్రం ఆగదని, ఎవరైనా అడ్డువస్తే జగన్నాథ రథచక్రాల్లా తొక్కుకుంటూ ముందుకు పోవడమేనన్నారు.
కాంగ్రెస్ కి గత ఎన్నికల్లో 19 సీట్లు వచ్చాయని ఈసారి అవికూడా రావన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ లో సీనియర్లకు గౌరవం లేదని, అధ్యక్షుడొక్కరే ఐపీఎస్, మిగతావాళ్లంతా హోంగార్డులని అనుకుంటున్నారని, అలాంటి చోట సీనియర్లు ఉండటం దురదృష్టకరం అని చెప్పారు. కేసీఆర్ స్థాయికి కాదు కదా.. ఆయన నీడను కూడా చేరుకునే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేదన్నారు. కేసీఆర్ లాంటి సమర్థుడెనౖ, బలమైన, దక్షత కలిగిన నాయకుడు ఉంటేనే.. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు సాగుతుందన్నారు కేటీఆర్.
దేశంలో 3శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ.. పంచాయతీ అవార్డుల్లో 30 శాతాన్ని కైవసం చేసుకుందని, ఇంతకుమించి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఏముంటుందని అన్నారు కేటీఆర్. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదేనన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీలకు సంబంధించి అత్యధిక అవార్డులు కూడా తెలంగాణకే వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల కల్పన, పచ్చదనం పెంపు వంటి 17 అంశాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు కేటీఆర్. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే మెరుగైన నమూనా ఉందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా చాలా మెరుగుపరచాల్సి ఉందన్నారు కేటీఆర్. హైదరాబాద్ మెట్రోను 250 కి.మీ. మేర విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. ఆర్టీసీలో మొత్తం విద్యుత్ బస్సులనే ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు సదుపాయాలను ప్రజలకు కల్పించడంతో పాటు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నామని చెప్పారు కేటీఆర్. సచివాలయాన్ని కూడా అత్యద్భుతంగా నిర్మించామన్నారు. అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎవరు వదులుకుంటారని ప్రశ్నించారు.
తొమ్మిదేళ్లుగా దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నా, దాడులు చేస్తున్నా ఏమీ చేయలేకపోయారని, తామేమీ బీజేపీ నేతల్లాగా భయపడి స్టేలు తెచ్చుకోలేదుకదా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బి.ఎల్.సంతోష్ అనే వ్యక్తి తెలంగాణలో నాయకులను కొనేందుకు వచ్చి బ్రోకర్ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పేపర్ లీకేజీ కేసులో దొరికిపోయారన్నారు. కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని బయటికొచ్చి స్వాతంత్ర సమరయోధుడిలా పోజులు కొడుతున్నారని చెప్పారు. మోదీ హామీ ఇచ్చినట్లు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. దేశంలో 18 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా? అదే నిజమైతే రాష్ట్రంలో నిరుద్యోగ మార్చ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు కేటీఆర్.