Telugu Global
Telangana

సేవ్ బీజేపీ.. నిజామాబాద్ లో అసంతృప్తి జ్వాలలు

మాజీలుగా మారిన మండల పార్టీ అధ్యక్షులు అర్వింద్ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.

సేవ్ బీజేపీ.. నిజామాబాద్ లో అసంతృప్తి జ్వాలలు
X

ఈసారి తెలంగాణలో అధికారం మాదే అంటోంది బీజేపీ. బీఆర్ఎస్, కాంగ్రెస్.. అందర్నీ మట్టికరిపిస్తామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు, తెలంగాణలో అధినేతను మార్చారు, కొత్త పదవుల్లో కొత్త నేతల్ని కూర్చోబెట్టారు. కానీ తెలంగాణలో బీజేపీకి కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. అందులో ఒకటి నిజామాబాద్ జిల్లా వ్యవహారం.

నిజామాబాద్ లో స్థానిక ఎంపీ అర్వింద్ కు పార్టీలోనే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. గత వారం నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల బీజేపీ అధ్యక్షులను అర్వింద్ ఏకపక్షంగా మార్చారు. దీంతో మాజీలంతా ఆయనపై ఫైరయ్యారు. మండల నాయకులు వెళ్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అయితే వారికి సర్దిచెప్పి పంపించేశారు రాష్ట్ర నేతలు. ఆరోజునుంచి వారు రగిలిపోతూనే ఉన్నారు. తాజాగా మరోసారి రోడ్డెక్కారు.

జిల్లాల్లో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. గతంలో కాంగ్రెస్ లో ఇలాంటి గొడవలు ఉండేవి, ఇప్పుడు బీజేపీలో కూడా ఇవి కామన్ గా మారాయి. నిజామాబాద్ విషయానికొస్తే.. మాజీలుగా మారిన మండల పార్టీ అధ్యక్షులు అర్వింద్ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. సేవ్ బీజేపీ నిజామాబాద్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. వారికి సర్దిచెప్పి పంపించడం జిల్లా నేతలకు సాధ్యం కాలేదు. ఈ వ్యవహారం అధిష్టానం వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో కూడా అర్వింద్ కి వ్యతిరేకంగా వారు ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని వైరివర్గాల కుట్ర అని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదు. నిన్న మొన్నటి వరకు పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్న నాయకులు ఒక్కసారిగా ఎంపీ అర్వింద్ కి వ్యతిరేకంగా మారడంతో నిజామాబాద్ బీజేపీ వర్గపోరు రోడ్డునపడింది.

First Published:  31 July 2023 2:33 PM IST
Next Story