Telugu Global
Telangana

కాంగ్రెస్‌లోకి డి.కె.అరుణ.. ఆ స్థానం నుంచే పోటీ..!

మక్తల్ లేదా నారాయణపేట టికెట్ ఇవ్వాలని అరుణ కాంగ్రెస్‌ను కోరుతున్నట్లు సమాచారం. నారాయణపేట ఆమె తల్లిగారి ప్రాంతం కావడంతో అక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి డి.కె.అరుణ.. ఆ స్థానం నుంచే పోటీ..!
X

బీజేపీకి మరో షాక్‌ తప్పదా..! కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే మరికొందరు నేతలు కాంగ్రెస్‌కు క్యూ కట్టనున్నారా..! అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కొంత సానుకూల పరిస్థితి ఏర్పడడం, బీజేపీ నిర్ణయాలతో పలువురు నేతలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ తిరిగి కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌లో మక్తల్‌ లేదా నారాయణపేట స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నట్లు సమాచారం.

బీజేపీ తరపున డి.కె.అరుణ గద్వాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆమె మాట మార్చారని సమాచారం. దీంతో బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో డి.కె.అరుణ పేరు కనిపించలేదు. గద్వాలలో ప్రతికూల పరిస్థితులు ఉండడమే కారణమని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే గద్వాల టికెట్‌ను బీఆర్ఎస్‌ నుంచి వచ్చిన సరితా తిరుపతయ్యకు కేటాయించింది. మక్తల్ లేదా నారాయణపేట టికెట్ ఇవ్వాలని అరుణ కాంగ్రెస్‌ను కోరుతున్నట్లు సమాచారం. నారాయణపేట ఆమె తల్లిగారి ప్రాంతం కావడంతో అక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

2004-18 మధ్య గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న డి.కె.అరుణ..వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిన డి.కె.అరుణ ..2019 మార్చిలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 2020 సెప్టెంబర్‌లో డి.కె.అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ అధిష్టానం. అయితే 2018 ఎన్నికల వేళ గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కారణంతో ఇటీవల బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిపై అనర్హత వేటు వేసిన హైకోర్టు..డి.కె.అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక డి.కె.అరుణ కాంగ్రెస్ గూటికి చేరితే మహబూబ్‌నగర్‌లో జితేందర్‌ రెడ్డి మినహా మరో గట్టి నాయకుడు ఉండరని బీజేపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.


First Published:  26 Oct 2023 5:18 AM GMT
Next Story