Telugu Global
Telangana

చలో నోవాటెల్.. ఈసారి నితిన్ తో నడ్డా భేటీ..

నితిన్ తో నడ్డా భేటీకి ఏపీలో ఎవరూ రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. నితిన్ పక్కా తెలంగాణ హీరో. మిగతా హీరోలపై ఏపీ అనే బ్రాండ్ ఉంది కానీ, నితిన్ ని తెలంగాణ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.

చలో నోవాటెల్.. ఈసారి నితిన్ తో నడ్డా భేటీ..
X

ఇటీవల హైదరాబాద్ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ని కలసి విందుభోజనం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కలకలానికి కారణం అయింది. ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఈ భేటీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ భేటీని వార్తల్లో ఉంచుతున్నారు. ఇప్పుడు మరో హీరో తెరపైకి వచ్చారు. బండి సంజయ్ పాదయాత్ర ముంగింపు సభకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యువహీరో నితిన్ ని కలవబోతున్నారు. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తో కూడా నడ్డా భేటీ అవుతారంటున్నారు. ఈ భేటీకి కూడా నోవాటెల్ వేదిక కాబోతుండటం మరో విశేషం.

ఎన్టీఆర్, నితిన్.. ఏంటీ వ్యూహం..

ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ తెలంగాణలో జరిగినా.. ఆ కలయిక ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఇప్పుడు నితిన్ తో నడ్డా భేటీకి ఏపీలో ఎవరూ రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. నితిన్ పక్కా తెలంగాణ హీరో. మిగతా హీరోలపై ఏపీ అనే బ్రాండ్ ఉంది కానీ, నితిన్ ని తెలంగాణ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. పోనీ నితిన్ కి రాజకీయాలతో సంబంధం ఉందా అంటే అదీ లేదు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాగా ఈమధ్య నితిన్ కి పెద్ద హిట్ కూడా లేదు. కానీ ఏరీకోరి నితిన్ ని ఎందుకు ఎంచుకున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన అతికొద్దిమంది హీరోల్లో నితిన్ ఒకరు అనేది ఇక్కడ ప్రస్తావనార్హం. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ కి నితిన్ ఏకలవ్య శిష్యుడు కావడంతో ఈ భేటీ సాధ్యమైందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి బీజేపీ లెక్క ఏంటనేది తేలాల్సి ఉంది.

ఇటీవల తెలంగాణలో రాజశేఖర్, జీవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలపై వారు విమర్శలు ఎక్కుపెడుతున్నారు కూడా. మరికొందరు చిన్నా చితకా నటులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ దశలో కాస్త పెద్ద హీరోలతో సమావేశాలు పెట్టుకోవాలనుకున్నట్టున్నారు బీజేపీ నేతలు. అందుకే అమిత్ షా ఎన్టీఆర్ తో కలిస్తే, నడ్డా.. నితిన్ తో సమావేశమవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సినీ నటులను బీజేపీ బాగానే ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద నటీనటులెవరూ బీజేపీవైపు లేరు. ఎన్టీఆర్, నితిన్.. ఇలా వరుసగా హీరోలతో సమావేశాలు పెట్టుకోవడం మాత్రం కొత్త చర్చకు తావిస్తోంది.

First Published:  27 Aug 2022 8:22 AM IST
Next Story