నడ్డా సభ క్యాన్సిల్.. బీజేపీకి ముందే కనిపించిన ఫ్యూచర్
అద్భుతాలు జరిగినా, చివరకు మోదీయే వచ్చి మునుగోడులో గడప గడపకు వెళ్లినా రాజగోపాల్ రెడ్డి గెలుపు అసాధ్యం. అందుకే చివరి నిమిషంలో నడ్డా తప్పుకున్నారు. ఒకవేళ సభ పెట్టినా చీవాట్లు, నిరసనలు తప్పవని తెలిసి సైలెంట్ అయ్యారు.
ఈనెల 31న మునుగోడులో జరగాల్సిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ రద్దయింది. అనివార్య కారణాలతో ఈ సభ రద్దు చేస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ సభపై దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్న స్థానిక నాయకులు షాక్ కి గురయ్యారు. ఓటమి ఖాయమైపోయిందని ఇక మూడో స్థానమే దిక్కు అని బాధపడుతున్నారు.
చీవాట్లు, నిరసనలు తప్పవా..?
రాజగోపాల్ రెడ్డికి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు ఇచ్చిన వ్యవహారంతో మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమైంది. తాజాగా మొయినా బాద్ ఫామ్ హౌస్ లో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.100 కోట్లు బేరం పెట్టినప్పుడు ఓటమి అంచనాలు పరిసమాప్తమయ్యాయి. అద్భుతాలు జరిగినా, చివరకు మోదీయే వచ్చి మునుగోడులో గడప గడపకు వెళ్లినా రాజగోపాల్ రెడ్డి గెలుపు అసాధ్యం. అందుకే చివరి నిమిషంలో నడ్డా తప్పుకున్నారు. ఒకవేళ సభ పెట్టినా చీవాట్లు, నిరసనలు తప్పవని తెలిసి సైలెంట్ అయ్యారు.
ఇప్పటికే మునుగోడు ప్రచారానికి జాతీయ నేతలు మొహం చాటేశారు. రాష్ట్ర నేతలు కూడా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు జ్వరం అంటూ దుప్పటి కప్పారు. అమిత్ షా ప్రచారంపై ఊహాగానాలు వినిపించినా అది కూడా రద్దయింది. బీజేపీ శ్రేణుల్లో చిట్ట చివరి ఆశ నడ్డా సభపైనే ఉంది. చివరకు ఈనెల 31 న జరగాల్సిన నడ్డా సభ కూడా క్యాన్సిల్ కావడంతో క్యాడర్ పూర్తి నిరాశకు గురవుతోంది.
మూడా..? నాలుగా..?
ఇప్పటి వరకూ బీజేపీకి మూడో స్థానం అని అనుకుంటున్నారంతా. ఇప్పుడు కనీసం పాల్ కంటే గోపాల్ ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే అదే గొప్ప అనే అంచనాకి వచ్చేశారు. ఇప్పుడిక ఎన్నికలు క్యాన్సిల్ చేసే దుర్మార్గమైన ఆలోచన బీజేపీ చేస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. ఏదో ఒక వంకతో మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయడానికి ఎన్నికల కమిషన్ పై బీజేపీ అధినాయకత్వం ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. సర్వేలు అన్నీ నెగెటివ్ గా ఉండటంతో ఎన్నిక రద్దు చేయించాలనే కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు.