Telugu Global
Telangana

సిరిసిల్ల నేతన్నలపై బీజేపీ కపట ప్రేమ..

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు.

సిరిసిల్ల నేతన్నలపై బీజేపీ కపట ప్రేమ..
X

చిలుప నూలుపై జీఎస్టీ విధించి నేత పరిశ్రమను చిన్నాభిన్నం చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అదే బీజేపీ నేతలు ఇప్పుడు నేతన్నల పక్షాన మాట్లాడటం హంతకుడే సానుభూతి తెలుపుతున్నట్టుగా ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభంలో ఉందని ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్ని బుట్టదాఖలు చేయడంతోపాటు, నేత పరిశ్రమకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు నెటిజన్లు. అయితే దీనికి విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బండి లేఖ రాయడం మాత్రం నేతన్నలకు మరింత మంట పెట్టేలా ఉంది.

బండి లేఖాస్త్రం..

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు కష్టాల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోందని, బతుకమ్మ చీరల బకాయిలు రూ.220 కోట్లు చెల్లించకపోవడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తీసుకెళతానని కూడా చెప్పారు బండి.

బండి లేఖలపై సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సానుభూతి పరులు మండిపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతన్నల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రతిపాదనలు బుట్టదాఖలు చేసి, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు ఎందుకని విమర్శించారు. సహాయం కేంద్రం నుంచే రావాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సమస్యపై దృష్టిసారించామని, పరిష్కారం కనుగొంటామని సోషల్ మీడియా వేదికగా బండికి బదులిచ్చారు.

First Published:  17 Jan 2024 2:31 PM GMT
Next Story