"ఒకే ఒక్కడు" సినిమా స్టయిల్‌లో తెలంగాణ ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
ట్రాఫిక్ సమస్య తగ్గించాలంటే రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించారు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఇందులో భాగంగా స్థానికులు, అధికారుల సమక్షంలో కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని కూల్చేయించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వినూత్నంగా ముందుకెళ్తున్నారు. "ఒకే ఒక్కడు" సినిమాలాగా నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను స్వయంగా ఆయనే ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారం కోసం ఫిర్యాదు బాక్సులను వినియోగించుకోవాలని, ఆయా గ్రామాలకు వచ్చి నేరుగా తానే సమస్యల్ని పరిష్కరిస్తానని చెబుతున్నారు రమణారెడ్డి.
ఇటీవల రహదారి విస్తరణ కోసం తన సొంతింటినే కూల్చేసుకున్నారు ఎమ్మెల్యే రమణారెడ్డి. వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. దీని విలువ ఏకంగా 6 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన ప్రకటించారు. కామారెడ్డి పట్టణ పాత మాస్టర్‌ప్లాన్‌లో జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి పంచముఖ హనుమాన్ ఆలయం మీదుగా రైల్వేగేట్ వరకు ఉన్న రోడ్డును 80 అడుగుల రోడ్డుగా నిర్ధారించారు. కానీ, ఆక్రమణల కారణంగా అది 34 అడుగులకు తగ్గిపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది.
ట్రాఫిక్ సమస్య తగ్గించాలంటే రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించారు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఇందులో భాగంగా స్థానికులు, అధికారుల సమక్షంలో కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని కూల్చేయించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ చేపట్టనప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే సొంత ఇంటిని కూల్చివేసినట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తెలిపారు. రోడ్ల విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.