Telugu Global
Telangana

అసెంబ్లీలో రాజాసింగ్ నర్మగర్భ వ్యాఖ్యలు..

సస్పెన్షన్ వేటు ఎత్తివేయకపోవడంతోపాటు, గోషా మహల్ నియోజకవర్గానికి కూడా తనను పార్టీ దూరం చేస్తోందనే అనుమానం రాజాసింగ్ లో బలపడింది. అందుకే ఆయన ఇంటిపోరు కూడా తనకు ఎక్కువైందని చెప్పారు. ఇంటా బయటా తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు.

అసెంబ్లీలో రాజాసింగ్ నర్మగర్భ వ్యాఖ్యలు..
X

ఎమ్మెల్యేరాజాసింగ్ పై ఇంకా సస్పెన్షన్ వేటు ఎత్తివేయలేదు బీజేపీ. ఆ విషయంలో ఆయన పార్టీపై కాస్త గుర్రుగానే ఉన్నారు. అందులోనూ గోషా మహల్ నియోజకవర్గాన్ని విడిచిపెట్టాలని ఆయనపై పార్టీ ఒత్తిడి తెస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాను గోషా మహల్ విడిచిపెట్టబోనని, అవసరమైతే రాజకీయాలే వదిలేస్తానంటూ రాజాసింగ్ కూడా తేల్చి చెప్పారు. ఈ దశలో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీపై నిందలు వేశారు.

నేను వచ్చే దఫా అసెంబ్లీకి రాకపోవచ్చు..

తాను వచ్చే దఫా అసెంబ్లీక రాకపోవచ్చు అని అన్నారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ‘‘వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదు. నేను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉంది. నేను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. నా సొంత వారు, బయటి వారు నన్ను అసెంబ్లీకి రాకుండా చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం. నేను ఉన్నా లేకున్నా నా గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై మీరు దయ చూపాలని నా ప్రార్థన..’’ అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు రాజాసింగ్.

బీజేపీపై కోపం..

సస్పెన్షన్ వేటు ఎత్తివేయకపోవడంతోపాటు, గోషా మహల్ నియోజకవర్గానికి కూడా తనను పార్టీ దూరం చేస్తోందనే అనుమానం రాజాసింగ్ లో బలపడింది. అందుకే ఆయన ఇంటిపోరు కూడా తనకు ఎక్కువైందని చెప్పారు. ఇంటా బయటా తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీపై ఉన్న కోపాన్ని ఇలా అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. ప్రస్తుత సమావేశాల్లో కూడా ఆయన బీజేపీ ఎమ్మెల్యేల పక్కన కూర్చోలేదు, విడిగానే కూర్చున్నారు. సస్పెన్షన్ వేటు ఎత్తువేయాలంటూ చాన్నాళ్లుగా కోరుతున్నా ఆయన్ను అధిష్టానం పట్టించుకోవట్లేదు. దీంతో తన కోపాన్ని రాజాసింగ్ ఇలా బయటపెట్టారని అనుకోవచ్చు. మరి రాజాసింగ్ రాజకీయ పయనం ఎటో చూడాలి.

--------------

ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందని రాజాసింగ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనుల కోసం తాను ఎన్నికైన నాటి నుంచి అనేక వేదికల మీద, అన్ని అసెంబ్లీ సమావేశాల్లో వివరించానని ప్రస్తావించారు. కాగా ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. కొంతకాలం గడిచాక సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే.. ఈమధ్య బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ అవ్వడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు (ఆదివారం) అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

First Published:  6 Aug 2023 7:39 AM GMT
Next Story