బీజేపీ నా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే.. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
రాజాసింగ్ తాజాగా మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలొచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ని పార్టీనుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. ఆ విషయంలో ఇంకా వెనక్కు తగ్గలేదు. సస్పెన్షన్ తొలగించకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే హోదాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. బీజేపీ మాత్రం ఆయన్ను దగ్గరకు తీయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. దీంతో రాజాసింగ్ పార్టీ మారుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలొచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు.
తాను బీజేపీతోనే ఉంటానని, బీజేపీలోనే చచ్చిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ని తొలగించకపోతే తానిక రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందేనన్నారు. బీజేపీ తనను దగ్గరకు తీసుకోకపోతే తాను వేరే పార్టీలోకి వెళ్లలేనన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరతానంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు.
హరీష్ రావుని ఎందుకు కలిశానంటే..?
హరీష్ రావు భేటీపై కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ధూల్ పేటలో ఉన్న ఆస్పత్రి అభివృద్ధికోసం హరీష్ రావు ఇంటికెళ్లి ఆయనతో చర్చించానని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధికోసం చాన్నాళ్లుగా తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అందులో భాగంగానే హరీష్ రావుని కలిశానన్నారు.