Telugu Global
Telangana

రాజాసింగ్, బండి సంజయ్ అరెస్ట్..

తెలంగాణలో బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయ్యారు. ఇద్దర్నీ వేర్వేరు కారణాలతో పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజాసింగ్, బండి సంజయ్ అరెస్ట్..
X

తెలంగాణలో బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయ్యారు. ఇద్దర్నీ వేర్వేరు కారణాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో టీఆర్ఎస్ నేతలకు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళన మొదలు పెట్టారు. ఈ ఆందోళనల్లో కొంతమంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ లకు నిరసనగా.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌ పూర్‌ మండలం పామ్నూరులో పాదయాత్ర శిబిరం వద్ద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష మొదలు పెట్టారు. దీక్ష పేరుతో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నారంటూ పోలీసులు మొదట హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా సంజయ్ వెనక్కు తగ్గలేదు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బండి సంజయ్ దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ నేపథ్యంలో హై డ్రామా..

బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో హైడ్రామా నెలకొంది. బీజేపీ కార్యకర్తలు ఆయన అరెస్ట్ ని ప్రతిఘటించారు. పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఓ దశలో పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు తీవ్ర ప్రతిఘటన మధ్య బండి సంజయ్ ని అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కించి అక్కడినుంచి తరలించారు.

రాజాసింగ్ అరెస్ట్..

మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఓ వర్గం మనోభావాలను కించపరిచే వీడియో పోస్ట్ చేశాడంటూ.. ఆయనపై హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాజా సింగ్ ని అరెస్ట్ చేయాలంటూ యువకులు పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ని షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ పార్టీ ఆందోళనలు చేపట్టింది. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ పోలీస్ స్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఒకేరోజు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేయడంతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది.

First Published:  23 Aug 2022 11:43 AM IST
Next Story