Telugu Global
Telangana

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కి లీగల్ నోటీస్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IRB సంస్థ వెయ్యికోట్లకు పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించి నోటీసులు పంపించింది.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కి లీగల్ నోటీస్
X

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లీజు విషయంలో ప్రతిపక్ష నేతలు చేసిన తీవ్ర విమర్శలు చివరకు వారికే చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆధారాలు లేకుండా, కేవలం అధికార పక్షంపై బురదజల్లడంకోసమే వారు విమర్శలు చేశారంటూ లీగల్ నోటీసులిచ్చారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులివ్వగా.. ఇదే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IRB సంస్థ వెయ్యికోట్లకు పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించి నోటీసులు పంపించింది.

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 158 కిలోమీటర్ల పొడవు ఉన్న రోడ్ ని HMDA లీజుకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లీజు కాంట్రాక్ట్ ని IRB ఇన్ ఫ్రా చేజిక్కించుకుంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ.. ఈ వ్యవహారంపై నిరాధార ఆరోపణలు చేశాయి. లీజు విషయంలో నిబంధనలు పాటించలేదనేది ఆ రెండు పార్టీల నేతల ఆరోపణ. అయితే దానికి వారి దగ్గర తగిన సాక్ష్యాధారాలు మాత్రం లేవు.

కేవలం రాజకీయ కోణంలో చేసిన ఈ విమర్శలను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు పంపించింది. లీజు దక్కించుకున్న IRB సంస్థ 10శాతం ఫీజు చెల్లించలేదని, లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్ ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వం అమ్మేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయగా ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు HMDA అధికారులు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి IRB సంస్థ లీగల్ నోటీసు పంపించింది. వెయ్యికోట్ల రూపాయల పరువునష్టం దావా వేసింది.

First Published:  29 May 2023 10:34 PM IST
Next Story