Telugu Global
Telangana

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు దుబ్బాకలో ఇంటి పోరు!

2020లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కేవలం 1000పై చిలుకు ఓట్లతో గెలిచిన రఘునందర్ రావు.. ఆనాటి నుంచి దుబ్బాకను పట్టించుకోకపోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు దుబ్బాకలో ఇంటి పోరు!
X

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర స్థాయి నేతలంటే గుర్తుకు వచ్చే వారిలో ఆయన ఒకరు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించడంలో ముందుంటారు. వారంలో ఎక్కువ రోజులు నాంపల్లిలోని ఆఫీసులోనే మీడియా మీట్లు ఇవ్వడంలో బిజీగా ఉంటారు. కానీ, సొంత నియోజకవర్గంలో మాత్రం తన వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోలేక పోతున్నారు. రాష్ట్ర నేతను అనే భ్రమలో పడి.. తనకు జరుగుతున్న నష్టాన్ని మాత్రం అంచనా వేయలేక పోతున్నారు.ఆయనే దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు.

2020లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కేవలం 1000పై చిలుకు ఓట్లతో గెలిచిన రఘునందర్ రావు.. ఆనాటి నుంచి దుబ్బాకను పట్టించుకోకపోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 2018లో అధికార బీఆర్ఎస్ పార్టీ రెండో సారి ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో తమకు తిరుగేలేదని భావించింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి బ్రేకులు వేసింది దుబ్బాక ఫలితం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సోలిపేట రామలింగారెడ్డి వరుసగా 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో దాదాపు 38 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2018కి వచ్చే సరికి ఏకంగా 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచి దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదని నిరూపించారు.

సోలిపేట ఆకస్మిక మరణంతో వచ్చిన ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలోకి దిగాయి. బీఆర్ఎస్ పార్టీ సోలిపేట భార్య సుజాతా రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే ఆనాటి పరిస్థితుల కారణంగా బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు కేవలం 1079 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుంచి పార్టీతో ఉండటం, ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తృతమైన పరిచయాల కారణం, సోలిపేట సుజాతారెడ్డి రాజకీయాలకు కొత్త కావడంతో అత్యల్ప మెజార్టీతో రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆనాటి నుంచి రఘునందన్ రావు బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. స్వతహాగా లాయర్, వాగ్దాటి కలిగిన నేత కావడంతో బీజేపీ కూడా ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కే పరిమితం అయిన రఘునందన్.. దుబ్బాకను పట్టించుకోవడం మానేశారు.

2020 ఉపఎన్నికలో తన గెలుపు కోసం పని చేసిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యర్తలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. రఘునందన్ రావు వ్యవహారశైలితో విసిగిపోయిన దుబ్బాక బీజేపీ శ్రేణులు తాజాగా అసమ్మతి రాగం వినిపిస్తున్నాయి. రఘునందన్ రావు నియోజకవర్గంలో తిరగడం లేదని, గెలిస్తే అన్ని పనులు ముందుండి చేపిస్తానన్న వ్యక్తి ఇప్పుడు కనీసం దుబ్బాక వైపు చూడటం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన అనేక మంది రెండు రోజుల క్రితం చేగుంటలో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తున్నది. నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్లు అంతా కలిసి రఘునందన్ రావుపై అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. చేగుంటలో జరిగిన సమావేశంలో అంతా రఘునందన్ రావుపైనే వ్యతిరేక గళం వినిపించినట్లు సమాచారం.

ఉపఎన్నిక సమయంలో అందరినీ కలుపుకొని పోతానని మాటిచ్చిన రఘునందన్.. ఇప్పుడు బీజేపీ సీనియర్లను అసలు పట్టించుకోవట్లేదు అనేది వారి ప్రధాన ఆరోపణ. గెలవడం కోసం తమను ఉపయోగించుకున్న వక్తి.. ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నాడని తమలో తామే చర్చించుకుంటున్నారు. ఈ విషయం రాష్ట్ర నేతల వరకు చేరినట్లు తెలుస్తున్నది. రఘునందన్ రావుపై అసమ్మతి పెరగడానికి అసలు కారణం ఏంటనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరో వైపు అసమ్మతి నేతలంతా ఈ నెలాఖరున మరోసారి భేటీ కావాలని చేగుంటలో కలిసినప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

ఇక రఘునందన్ రావు మాత్రం అసమ్మతి నేతల ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. వాళ్లెవరూ పార్టీ కోసం కానీ, తన కోసం కానీ పని చేయలేదని అంటున్నారు. దుబ్బాకలో తనను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకే.. వాళ్లందరూ చేగుంటలో కలిశారని మండిపడ్డారు. అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. నిప్పు లేనిదే పొగరాదని.. రఘునందన్ రావు లోకల్ నాయకులను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని భావిస్తోంది. అందుకే దుబ్బాక విషయంలో అసమ్మతి నేతలతో కూర్చొని సమస్యను సాల్వ్ చేసుకోవాలని రఘునందన్ రావుకు సూచించినట్లు తెలుస్తున్నది.

First Published:  4 Jan 2023 5:18 AM IST
Next Story