కేసీఆర్‌ను ఓడిస్తా: ఈటల రాజేందర్
తాను గజ్వేల్ లో పోటీచేస్తానని ఈటల ప్రకటించిన అనంతరం.. టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. దీంతో ఆయన మరోసారి ఈ తరహా ప్రకటన చేశారు.
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. తాను గజ్వేల్ లో పోటీచేసి కేసీఆర్ ను ఓడిస్తానని గతంలో ఈటల సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే తరహా సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడ పోటీచేసినా తాను బీజేపీ అధిష్టానం అనుమతితో ఆయన మీద పోటీచేసి గెలుపొందుతానని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా `పల్లెగోస-బీజేపీ` భరోసా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మాయమాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తమ పార్టీలోకి త్వరలో మరిన్ని వలసలు పెరుగుతాయని చెప్పారు.
ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేరినా రాజీనామా చేయించి చేర్చుకుంటామన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఈటల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాను గజ్వేల్ లో పోటీచేస్తానని ఈటల ప్రకటించిన అనంతరం.. టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. దీంతో ఆయన మరోసారి ఈ తరహా ప్రకటన చేశారు.
కేసీఆర్, టీఆర్ఎస్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఈటల రాజేందర్ మాత్రం టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తే.. ఈ చర్చ రసకందాయంలో పడుతుంది. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మౌనంగానే ఉంటున్నారు. ఆయన సవాల్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.