Telugu Global
Telangana

బండి దూకుడుపై బీజేపీ అధిష్టానం సీరియస్.. తెలంగాణలో ఎదురు దెబ్బే అని అంచనా!

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఏకంగా టెన్త్ పేపర్ లీక్ కుట్రకు పాల్పడటం తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. పైకి గంభీరంగా మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను వెనకేసుకొస్తున్నా.. చాలా మంది నాయకులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

బండి దూకుడుపై బీజేపీ అధిష్టానం సీరియస్.. తెలంగాణలో ఎదురు దెబ్బే అని అంచనా!
X

తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ లక్ష్యం. అందుకే కాస్త దూకుడుగా వ్యవహరిస్తాడని ఆలోచించి బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. అప్పటి నుంచి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేస్తూ, నిత్యం మీడియాలో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. బండి సంజయ్ వ్యవహార శైలిపై మొదటి నుంచి ప్రజల్లో వ్యతిరేకతే ఉన్నది. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తాం.. ఏయే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. లాంటి మాటలు మాట్లాడకుండా.. మతానికి సంబంధించిన విషయాలే మాట్లాడేవారు. యువతను ఆకట్టుకోవడానికి మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మైలేజీ పెంచుకోవడానికి ప్రయత్నించేవారు.

యువతను ఉద్యోగాలు, చదవులు వదిలేసి తన వెంట రావాలని పిలుపునిచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు బండి సంజయ్. మొదట్లో బండి సంజయ్ దూకుడు చూసి తమది సరైన ఎంపికే అని బీజేపీ అధిస్టానం సంబరపడింది. కానీ రాను రానూ సంజయ వ్యవహార శైలి వారికి కూడా మింగుడు పడటం లేదు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంలో ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేశారు. తన దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని సిట్ నోటీసులు పంపినా.. విచారణకు రాలేదు. తాను రానని తెగేసి చెప్పారు. అప్పుడే అతడిపై అనుమానాలు మొదలయ్యాయి.

తాజాగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఏకంగా టెన్త్ పేపర్ లీక్ కుట్రకు పాల్పడటం తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. పైకి గంభీరంగా మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను వెనకేసుకొస్తున్నా.. చాలా మంది నాయకులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అధిష్టానం కూడా బండి సంజయ్ పేపర్ లీక్ చేసిన ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం. బండి చేసిన పని వల్ల తెలంగాణలో పార్టీ దూకుడుకు బ్రేక్ పడినట్లయ్యిందని భావిస్తోంది. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపి లబ్ది పొందాల్సింది పోయి.. మనమే తప్పులు చేస్తే ఎలా అని అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజశేఖర్ రెడ్డికి బీజేపీ నాయకులతో పరిచయాలు ఉన్న విషయం బయటకు వచ్చింది. ఆ రెండు ఘటనల విషయంలో పార్టీ ఎలాగోలా కౌంటర్లు ఇస్తూ తమకు ఆ మచ్చ అంటకుండా ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇప్పుడు టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడే అడ్డంగా దొరికిపోవడం.. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌ ఖైదీగా జైలులో ఉండటం బీజేపీ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది.

రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బండి సంజయ్ కారణంగా బీజేపీపై వ్యతిరేకతం మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇది తప్పకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎదురు దెబ్బగా మారుతుందని భావిస్తోంది. టెన్త్ పేపర్ లీక్ తర్వాత పోలీసుల విచారణలో బండి సంజయ్ తన ఫోన్ లేదని చెప్పడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సంజయ్ కేవలం టెన్త్ పేపర్ లీక్ కాకుండా.. ఇంకా ఏమైనా చేశాడా అనే చర్చ కూడా పార్టీలో మొదలైంది.

మరో రెండు రోజుల్లో ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. వచ్చేది పలు శంకుస్థాపనలకే అయినా.. ఆ రోజు పార్టీ నాయకులతో కీలక భేటీ అవుతారని తెలుస్తున్నది. ఒక వేళ బండి సంజయ్‌కు బెయిల్ వస్తే.. ఈ విషయంపై నేరుగా అతడినే వివరణ అడిగే అవకాశం ఉంది. మోడీ పర్యటన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

First Published:  6 April 2023 10:23 AM IST
Next Story