Telugu Global
Telangana

మేడిగడ్డ కేంద్రంగా ఎన్నికల రాజకీయం.. నేడు బీజేపీ నేతల పరిశీలన

ఇటీవలే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బ్యారేజ్ పరిశీలనకు వెళ్లి సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి నవ్వులపాలయ్యారు. ఇప్పుడు బీజేపీ నేతలు బ్యారేజ్ పరీశీలనకు బయలుదేరుతున్నారు.

మేడిగడ్డ కేంద్రంగా ఎన్నికల రాజకీయం.. నేడు బీజేపీ నేతల పరిశీలన
X

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ల​క్ష్మీ బ్యారేజీ కేంద్రంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు వినపడుతున్నాయి. ఇటీవలే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బ్యారేజ్ పరిశీలనకు వెళ్లి సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి నవ్వులపాలయ్యారు. ఇప్పుడు బీజేపీ నేతలు బ్యారేజ్ పరీశీలనకు బయలుదేరుతున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఈరోజు హెలికాప్టర్ లో బ్యారేజీని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మరోసారి పోలీసులు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పిల్లర్ కుంగడంతో.. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేశారు అధికారులు. ప్రస్తుతం డ్యామ్ కు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు మాత్రమే అక్కడకు వెళ్తున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మేడిగడ్డ బ్యారేజ్ పైకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఇలాగే హడావిడి చేయాలనుకుంటున్నారు. దీంతో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి బ్యారేజీని మూసివేశారు.

ఎన్నికల వేళ, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా తెలంగాణలో కలకలం రేపింది. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కుటప్రూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కమిటీ రావడం, అధ్యయనం చేయడం, నివేదిక ఇవ్వడం అంతా మూడు రోజుల్లోనే జరిగిపోయిందని, ఈ వేగం చూస్తే దేశంలో మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. ఇదీ అలాగే చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మేడిగడ్డ వద్ద డ్యామ్ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న 20వ పియర్ వద్ద నిపుణులు పరిస్థితి అంచనా వేస్తున్నారు. డ్యామ్ నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్ట్ సంస్థపైనే ఉండటంతో.. ప్రభుత్వ ఖజానాకు నష్టం లేకుండా బ్యారేజీ మరమ్మతు పనులు పూర్తవుతాయి.

First Published:  4 Nov 2023 5:26 AM GMT
Next Story