Telugu Global
Telangana

బ్యాంకుకు 20 కోట్ల ఎగనామం పెట్టిన తెలంగాణ బీజేపీ నేతలు

బీజేపీ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రుద్రమ దేవి ఇద్దరూ కలిసి లక్ష్మీ విలాస్ బ్యాంకుకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారు. రుణాలు తీసుకున్న తరువాత చెల్లించకపోవడంతో చివరకు వారి ఆస్తులను రిలయన్స్ అస్సెట్స్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఈ-వేలం వేయడానికి పత్రికా ప్రకటన వెలువడింది.

బ్యాంకుకు 20 కోట్ల ఎగనామం పెట్టిన తెలంగాణ బీజేపీ నేతలు
X

పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లు, రాజకీయ నాయకులు బ్యాంకుల నుండి లోన్లు తీసుకోవడం వాటిని ఎగ్గొట్టడం ఈ దేశంలో మాములై పోయింది. చాలా సార్లు వాళ్ళ నుంచి అప్పులను వసూలు చేసుకోలేక బ్యాంకులు చేతులెత్తేయడం, ఆ అప్పులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం కూడా ఈ దేశంలో మామూలే. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి నాయకులు అదే బాటలో నడిచారు. 20 కోట్ల అప్పు ఎగ్గొట్టారు. అయితే ఆ బ్యాంకు వారి ఆస్తులను వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

బీజేపీ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రుద్రమ దేవి ఇద్దరూ కలిసి లక్ష్మీ విలాస్ బ్యాంకుకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారు. రుణాలు తీసుకున్న తరువాత చెల్లించకపోవడంతో చివరకు వారి ఆస్తులను రిలయన్స్ అస్సెట్స్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఈ-వేలం వేయడానికి పత్రికా ప్రకటన వెలువడింది.

వివరాల్లోకి వెళితే, బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, బీజేపీ మహిళా నేత రుద్రమ దేవి ఇద్దరూ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. నగరంలోని హయత్ నగర్, మన్సూరాబాద్ పరిధిలోని మెస్సర్స్ జె వి ఆర్ హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రుద్రమాన్ బోటిక్, ఇతర చిన్న చిన్న కంపెనీల పేరుతో వీరిద్దరూ కలిసి మొత్తం దాదాపు 20 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. రుణాలు తీసుకున్న తరువాత తిరిగి చెల్లించడానికి నిరాకరించడంతో సదరు బ్యాంకు వీరిద్దరి మీద చట్టపరమైన చర్యలకు సిద్దమైంది.






గతంలో వీరిద్దరూ యువ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రజల నుండి వీరు పెట్టిన పార్టీకి స్పందన రాకపోవడంతో ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తరువాత ముఖ్యంగా రుద్రమ దేవి వార్తల్లో నిలబడటానికి బీఆర్ఎస్ పార్టీ నేతలను విమర్శించిన తీరు ఇటీవల వివాదాస్పదం అయింది.

ఇరువురి నేతలకు సంబందించిన ఆర్ధిక లావాదేవీల అక్రమాలు వెలుగులోకి రావడంతో వీరిద్దరి వ్యవహారం పట్ల రాష్ట్ర బీజేపీలో కొత్త చర్చ నడుస్తోంది. ఇలాంటి నేతలను పార్టీ నుండి బహిష్కరించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి వ్యవహారం మీద సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. రుణాలు ఎగ్గొట్టడానికే బీజేపీలో చేరినట్లు పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల ఎగవేతదారులకు బీజేపీ పార్టీ అడ్డాగా మారిందని మరోసారి నిరూపితం అయిందని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం రాష్ట్ర బీజేపీలో చిలికి చిలికి గాలివాన అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

First Published:  9 Feb 2023 1:24 PM IST
Next Story