అమిత్‌షా వస్తారు.. ఊపు తెస్తారు.. తెలంగాణ బీజేపీ ఆశలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై చర్చించేందుకు బీజేపీ నేడు హైదరాబాద్‌లో భేటీ ఏర్పాటు చేసింది.
తెలంగాణలో ఒక్కసారిగా ఎగిసి చప్పున చల్లారిపోయిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకెళ్లడానికి సరైన ఉత్ప్రేరకం కోసం ఎదురుచూస్తోంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నంత భావన కలగజేసిన బీజేపీ గత రెండు మూడు నెలలుగా పూర్తిగా చల్లబడిపోయింది. పేరుకు ఎన్నికల్లో అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా.. పార్టీకి ఊపు కనపడటం లేదన్న నిరాశ కమలం పార్టీ క్యాడర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 17న హైదరాబాద్ విమోచనాత్సవాలకు అమిత్‌షా వస్తారని, పార్టీకి ఊపు తెస్తారని టీ-బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది.
ఎన్నికల సన్నద్ధత కోసం నేడు భేటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై చర్చించేందుకు బీజేపీ నేడు హైదరాబాద్‌లో భేటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జవడేకర్, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి సునీల్‌బన్సల్, ముఖ్య నేతలు అరుణ, లక్ష్మణ్‌తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా పాల్గొని ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై చర్చిస్తారు.
అసలు ఇంతకీ ఆయన వస్తారా?
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగే హైదరాబాద్ విమోచన ఉత్సవాలకు అమిత్‌షా వస్తారని పార్టీ ఆశిస్తోంది. అయితే ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఏదైనా మార్పు జరిగితే రాజ్‌నాథ్ సింగ్ రావచ్చు. అమిత్‌షాకు తెలంగాణ పార్టీ పరిస్థితిపై బాగా అవగాహన ఉంది. ఉప ఎన్నికలు, ఎన్నికల వేళ వచ్చి పార్టీని బాగా ఉత్తేజ పరిచి ఎన్నికలకు నడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనొస్తేనే బాగుంటుందని కమలం క్యాడర్ కోరుకుంటోంది.
*