మోదీ సభలో జనం లేరు.. రామగుండంలో బీజేపీ ఫ్లాప్ షో
అక్కడ చూస్తే సగం గ్యాలరీలు కూడా నిండలేదు. కుర్చీలన్నీ ఖాళీ. జన సమీకరణలో విఫలమైన నాయకులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు.
రామగుండంలో మోదీ సభకు 50వేలమంది వస్తారని అంచనా. కానీ అక్కడ వచ్చింది కేవలం 7వేల మంది మాత్రమే. ఈ లెక్క చాలు తెలంగాణలో బీజేపీకి ఉన్న ఆదరణ ఏంటో చెప్పడానికి. జన సమీకరణలో స్థానిక నాయకులు విఫలం అయ్యారు. మునుగోడు ఫలితం తేడా కొట్టడంతో అందరూ నిరాశలోనే ఉన్నారు. ఈ దశలో జనసమీకరణకు సాహసం చేయలేకపోయారు. కొంతవరకు ధైర్యం చేసి డబ్బులు పంచినా స్థానికులు మోదీ సభకు వచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో సభ జనం లేక వెలవెలపోయింది.
ఎన్టీపీసీలోని మైదానంలో ఏర్పాటుచేసిన సభకు 50వేల మంది హాజరవుతారని వారం రోజుల ముందునుంచీ గొప్పలు చెప్పుకున్నారు బీజేపీ నేతలు. వేల మంది రైతులతో సమావేశం ఉంటుందని ఊదరగొట్టారు. తీరా అక్కడ చూస్తే సగం గ్యాలరీలు కూడా నిండలేదు. కుర్చీలన్నీ ఖాళీ. జన సమీకరణలో విఫలమైన నాయకులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. ముందస్తుగా సమాచారం ఉన్నా కూడా జనాల్ని తీసుకు రాలేకపోయారని అటు అధిష్టానం కూడా స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిందట.
ఏపీలో అలా, తెలంగాణలో ఇలా..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా జనసమీకరణ చేపట్టింది. ఆంధ్రా యూనివర్శిటీ జన సముద్రంలా మారిందని సీఎం జగన్ కూడా నేరుగా సభలో ప్రస్తావించడం విశేషం. ఆ స్థాయిలో జన సమీకరణ చేసి మోదీన ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. ఇక్కడ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. అడుగడుగునా మోదీ గో బ్యాక్ బ్యానర్లే కనిపించాయి, నల్లబెలూన్లు స్వాగతం పలికాయి. చివరకు జనం లేక సభ వెలవెలపోయింది.