Telugu Global
Telangana

సొంతగూటికి తుల ఉమ.. ఇవాళ కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి..!

వేములవాడ నియోజకవర్గంలోని బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన తుల ఉమ 2014 సంవత్సరంలో కథలాపూర్‌ జెడ్పీటీసీగా గెలుపొంది ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా 2019 వరకు పనిచేశారు.

సొంతగూటికి తుల ఉమ.. ఇవాళ కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి..!
X

వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు స‌మాచారం. ఇప్పటికే కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తుల ఉమతో సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో తుల ఉమ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి తుల ఉమ బీజేపీ టికెట్ ఆశించారు. అయితే చివరి లిస్టులో తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ అధిష్టానం తర్వాత మార్పులు చేసింది. చివ‌రి నిమిషంలో తుల ఉమ అభ్య‌ర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి.. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌ రావు తనయుడు వికాస్‌రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఉమ. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుజ్జగింపుల కోసం బీజేపీ నేతలు వేస్తే చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ వల్లే తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు.

వేములవాడ నియోజకవర్గంలోని బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన తుల ఉమ 2014 సంవత్సరంలో కథలాపూర్‌ జెడ్పీటీసీగా గెలుపొంది ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా 2019 వరకు పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ఈటల వెంట బీజేపీ కండువా కప్పుకున్నారు. వేములవాడ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన తుల ఉమకు టికెట్‌ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది బీజేపీ. దీంతో ఆమె తిరిగి సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  12 Nov 2023 9:12 AM IST
Next Story